పిల్లలకు రోజూ పనీర్ వంటకాలను పెట్టవచ్చా..
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:34 AM
బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్ తయారు చేసి వాడటం ఉత్తమం.
- పనీర్ ఎక్కువగా వాడితే...
మా పిల్లలకు పనీర్ అంటే చాలా ఇష్టం. దక్షిణ భారతదేశంలో మనం పనీర్‌ను అంత రెగ్యులర్‌గా వాడం కదా. మరి రోజూ పనీర్ వంటకాలను పెట్టవచ్చా?
- శిఖ, గుడివాడ
బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్ తయారు చేసి వాడటం ఉత్తమం. ఇంట్లో, టోన్డ్ లేదా కొవ్వు మితంగా ఉన్న పాలతో తయారు చేసినప్పుడు పనీర్‌ను రోజూ తినవచ్చు, కానీ తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా బాగా నూనెలో వేపిన రూపంలో కాకుండా కూరగాయలతో కలిపి వండితే మరింత ఆరోగ్యకరం. ఉదాహరణకు మిక్స్ ్డవెజిటబుల్ కర్రీ, పాలకూర పనీర్ వంటి వంటకాలు రుచికరంగానే కాకుండా పోషకవిలువలతో కూడినవిగా ఉంటాయి. పాలల్లో లాగానే పనీర్‌లో ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల అభివృద్ధికి, శరీరానికి బలాన్ని అందించడానికి చాలా సహాయపడతాయి.
ఈ మధ్య అందరూ గిర్నీ (పిండిమర) దగ్గరే గోధుమలు, బియ్యం, ఉలవలు లాంటివి పట్టించుకుంటున్నారు, రెడీమేడ్ గా లభించే పిండి వస్తువులు కొనడం తగ్గించారు. ఇలా గిర్నీలో పట్టించిన పిండి వాడడం వల్ల ఏవైనా లాభాలున్నాయా?
- పద్మజ, హైదరాబాద్

గిర్నీ దగ్గర పట్టించిన గోధుమ, బియ్యం, ఉలవల లాంటి పిండి పదార్థాలు బయట దొరికే రెడీమేడ్ పిండి పదార్థాలు రెండిటిలోనూ ఇంచు మించు అవే పోషకాలు ఉంటాయి. పోషక విలువల్లోనూ పెద్దగా తేడా ఉండదు. అయితే గిర్నీ దగ్గర పిండిగా చేసేటప్పుడు ఒక సమస్య వస్తుంది. అక్కడ ఒకే యంత్రంలో గోధుమలు, బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలు అన్నీ పట్టిస్తారు. దాంతో ఒక్కోసారి మిగిలిపోయినవి కలిసిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల పూర్తిగా శుద్ధమైన పిండి దొరక్కపోవచ్చు. ప్రత్యేకంగా అలర్జీలు ఉన్నవారికి ఇది సమస్యగా మారుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా గోధుమ అలర్జీ లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటే, గోధుమలు మర పట్టించిన తర్వాత అదే యంత్రంలో బియ్యం లేదా మరేదైనా పిండి పట్టించినప్పుడు కొద్దిపాటి గోధుమ పొడి కూడా మిశ్రమంలో కలిసిపోతుంది. ఇలా జరిగితే ఆ అలర్జీ ఉన్నవాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర ధాన్యాలు లేదా పప్పుల అలర్జీ ఉన్నవారు కూడా ఇలాగే ప్రభావితమవుతారు. సాధారణంగా పిండి గిర్నీలు రోజూ పూర్తిగా శుభ్రం చేయడం ఉండదు. అదే ఫ్యాక్టరీలలో అయితే ఆహార పరిశుభ్రత నియమాలకు లోబడి పిండి మరలను తరచూ శుభ్రం చేస్తారు. అందువల్ల గిర్నీ పిండి తీసుకోవడం వల్ల పోషక విలువల్లో ఎలాంటి లోటు లేకపోయినా, శుభ్రత, అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నాకు 60 ఏళ్ళు. రాత్రి భోజనానికి తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను చెప్పగలరు?
- కృష్ణకుమార్, వరంగల్
మీ వయసు 60 ఏళ్ళు కావడంతో రాత్రి భోజనం తప్పనిసరిగా తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతో ఉండాలి. ఈ సమయంలో నూనెలో వేయించిన వడ, పూరి, ఎక్కువ నూనెతో చేసే దోశ వంటి వంటకాలు తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే అవి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. కూరగాయల సూప్, తేలికపాటి పప్పు, ఉడికించిన కూరగాయలు లేదా కొద్దిగా పెరుగన్నం లాంటి ఆహారాలు మంచి ఎంపికలు.

రాత్రి భోజనం తప్పనిసరిగా మీ నిద్ర సమయానికి కనీసం రెండు గంటల ముందే చేయాలి. ఇలా చేస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత 15-20 నిమిషాలు నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు మరింత సహాయపడుతుంది, శరీరానికి తేలికగా అనిపిస్తుంది. మొత్తం మీద, రాత్రి తేలికపాటి ఆహారం, సమయానికి భోజనం చేయడం, ఆ తర్వాత స్వల్ప నడక అలవాటు చేసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడటానికి, మంచి నిద్రకు దోహదపడతాయి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..
విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Read Latest Telangana News and National News