Glowing Skin Tips : ఈ సహజ పానీయాలు తాగండి.. మెరిసే చర్మం పొందండి..
ABN , Publish Date - Feb 02 , 2025 | 06:46 PM
మచ్చల్లేని మృదువైన చర్మం కావాలని ఎవరూ మాత్రం కోరుకోరు. అందుకోసం ఖరీదైన క్రీంలు రాయాల్సిన పని లేదు. ఈ సహజ పానీయాలు తాగడం అలవాటు చేసుకుంటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం..
ప్రతి ఒక్కరూ మచ్చల్లేని మృదువైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో అదేమంత తేలిక కాదు. అయితే, హెల్తీ స్కిన్ కేవలం చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడితేనే వస్తుందని అనుకోవడం అపోహే. ఖరీదైన క్రీములొక్కటే చర్మాన్ని కాపాడలేవు. తీసుకునే ఆహారం, పానీయాలు కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అన్నది చాలా ముఖ్యం. చర్మ ఆరోగ్యం కోసం ఉదయాన్నే ఈ ఆయుర్వేద పానీయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ తప్పక మీ సొంతమవుతుంది..
చర్మం సహజ మెరుపు పొందాలంటే రోజూ ఉదయాన్నే కింద ఇచ్చిన ఆయుర్వేద పానీయాలు తాగండి. సహజ టానిక్‌లా పనిచేసి చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
నిమ్మకాయ నీరు: నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ కొల్లాజెన్ ఉత్పత్తికి, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ రెండూ ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో ముఖ్యమైనవి. ఉదయాన్నే నిమ్మరసం తాగితే శరీరం డీటాక్స్ అవుతుంది. హైడ్రేషన్, జీర్ణక్రియకు మెరుగుపడతాయి.
కొబ్బరి నీరు: కొబ్బరి నీరులో సహజంగానే హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువ. చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడే ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉంటాయి. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడతాయి. చర్మం పొడిబారడాన్ని నివారించి తాజాగా ఉంచుతాయి.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా EGCG (ఎపిగల్లోకాటెచిన్ గాలెట్) యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది UV దెబ్బతినకుండా చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది. ఎందుకంటే, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను ఇందులో ఎక్కువ.
పసుపు పాలు: పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం. పసుపు పాలు ఆక్సిటేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మం వృద్ధాప్యంతో పోరాడటానికి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి.
కలబంద రసం: అలోవెరా చర్మాన్ని మృదువుగా చేయడానికి, చర్మ తేమను మెరుగుపరచడానికి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే కలబంద రసం తాగడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలను తగ్గుతాయి. కొన్నాళ్లలోనే క్లియర్ స్కిన్ పొందుతారు.
దోసకాయ, పుదీనా రసం : దోసకాయలో చలువ చేసే లక్షణాలు ఎక్కువ. ఇవి కడుపు ఉబ్బరం, వాపును తగ్గించడంలో సహాయపడితే.. పుదీనాలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. ఒక దోసకాయకు కొన్ని తాజా పుదీనా ఆకులు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కాస్త ఉప్పు జోడించి జ్యూస్ చేసి రోజూ ఉదయాన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి.