Jubli Hills Election: ఇక్కడ ఓటు.. అక్కడ నోటు
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:53 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల బేరసారాలన్నీ పక్క నియోజకవర్గాల్లోకి మారాయి. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభించాయి. కీలకంగా ఉన్న వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే బేరసారాలకు దిగితే ప్రత్యర్థులకు తెలుస్తుందని, అడ్డాలను పక్క నియోజకవర్గాలకు మార్చారు.
- కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌లో అడ్డాలు
- ఆయా ప్రాంతాల్లోనే జిల్లాల నేతలు తిష్ట
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubli Hills Election By Election)లో ఓట్ల బేరసారాలన్నీ పక్క నియోజకవర్గాల్లోకి మారాయి. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభించాయి. కీలకంగా ఉన్న వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే బేరసారాలకు దిగితే ప్రత్యర్థులకు తెలుస్తుందని, అడ్డాలను పక్క నియోజకవర్గాలకు మార్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలంతా ఆయా ప్రాంతాల్లోనే బేరసారాలు ప్రారంభించినట్లు తెలిసింది.
ముఖ్య నేతల నివాసాలే వేదికలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ కోసం కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతల నివాసాలను వేదికలుగా మార్చారు. అపార్ట్‌మెంట్, కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులు, ఇతర ముఖ్యులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. సమస్యల పరిష్కారంపై పోటాపోటీగా హామీలిస్తున్నాయి. మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌వాసులు సీసీ కెమెరాలను అమర్చాలని కోరడంతో ఓ ప్రధాన పార్టీ నేతలు సుమారు రూ.60వేలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరో పార్టీ నేతలు నీటి ఇబ్బందులు రాకుండా బోరు వేయాలని కోరడంతో బోరు వేసి మోటర్ సైతం బిగించిన్నట్లు తెలిసింది.

వారికి అక్కడే వసతి
ఉప ఎన్నికలు కానీ, సాధారణ ఎన్నికల్లో కానీ ప్రచార పర్వం ముగియగానే స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదలాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఆయా పార్టీల ముఖ్యమైన నేతలు, కార్యకర్తలను శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లోని ఫ్లాట్లలో వసతి కల్పించగా.. మరికొందరికి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, ఈఎ్‌సఐ, కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట, భరత్‌నగర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వసతి కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News