Share News

Jubilee Hills By Election: పరాకాష్టకు చేరిన సీఎం రేవంత్ మూర్ఖత్వం: జగదీష్ రెడ్డి

ABN , Publish Date - Nov 09 , 2025 | 04:29 PM

సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న కుమార్తె వివాహం శనివారం (నవంబర్ 8వ తేదీ) హైదరాబాద్‌లో జరిగిందన్నారు. దీనికి ఆయన భార్యతో కలిసి ఎందుకు వెళ్ల లేదో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Jubilee Hills By Election: పరాకాష్టకు చేరిన సీఎం రేవంత్ మూర్ఖత్వం: జగదీష్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 09: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే.. తన కుర్చీకి ఎసరు వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్పంచ్ ఎన్నికలకు తిరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రెస్ క్లబ్.. రేవంత్ రెడ్డికి పబ్ మాదిరి కన్పించిందని వ్యంగ్యంగా అన్నారు. అందుకే స్టార్ హోటల్‌లో ప్రెస్ మీట్ పెడుతున్నారంటూ మండిపడ్డారు.


ఆదివారం తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ప్రశ్నించిన వారిని.. నువ్వు చేద్దువురా అంటూ రేవంత్ రెడ్డి చేతకాని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. సీఎం కుర్చీ నుంచి దిగిపోయి ఆర్. కృష్ణయ్య లేదా మంద కృష్ణమాదిగకు అప్పగించాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. సీఎం కుర్చీ ఇంకెవరికి ఇచ్చినా.. రేవంత్ రెడ్డి కంటే మంచిగా వారు పని చేస్తారన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్తమ్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్ రెడీగా ఉన్నారన్నారు.


కేసీఆర్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. 24 గంటల ఉచిత కరెంట్, ఇంటింటికి మంచి నీరు దేశంలో కేసీఆర్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకోవటం సిగ్గు చేటుగా ఉందని తెలిపారు. సీఎంలుగా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల పాలనపై రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.


పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పీజేఆర్ కుటుంబానికి రాజకీయాల్లో స్థానం లేకుండా చేసిందే రేవంత్ రెడ్డి ఆంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంపై అంత ప్రేమే ఉంటే.. పీజేఆర్ కొడుక్కి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు శ్మశానానికి స్వర్ణయుగం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో సొంత జిల్లా పాలమూరులో ఆకలి చావుల చోటు చేసుకున్న సంగతి రేవంత్ రెడ్డి మర్చిపోయాడా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.


నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ తెచ్చింది ఎవరో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది దేశంలో కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్, కేటీఆర్‌లని తెలిాపారు. కేటీఆర్ రోడ్ షోలకు వస్తోన్న జనాల్ని చూసి‌‌.. రేవంత్ రెడ్డికి మైండ్ పోయిందని ఎద్దేవా చేశారు. ఐటన్ సాంగ్స్ మాత్రమే రేవంత్ రెడ్డికి గుర్తుంటాయంటూ వ్యంగ్యంగా అన్నారు.


రేవంత్ రెడ్డి మాటలు హద్దులు దాటుతున్నాయన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి.. దేశంలో ఎక్కడకి వెళ్ళినా కేటీఆర్‌ను మాత్రమే ప్రజలు గుర్తు పడతారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖత్వం పరాకాష్ఠకు చేరుకుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న కుమార్తె వివాహం శనివారం (నవంబర్ 8వ తేదీ) హైదరాబాద్‌లో జరిగిందన్నారు. దీనికి ఆయన భార్యతో కలిసి ఎందుకు వెళ్ల లేదో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

చిన్న ముక్క తింటే.. ఈ వ్యాధులు దూరం

పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..

For More TG News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 05:59 PM