Jubilee Hills By Election: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టే రాజ్యం: కేటీఆర్
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:19 PM
ఎలక్షన్స్ లేకుంటే సినిమా వాళ్ల మీద కేసులు పెడతారని కేటీఆర్ విమర్శించారు. అదే ఎలక్షన్స్ వచ్చాయంటే సినిమా వాళ్ళ కాళ్ళ మీద పడతారంటూ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని ఈ సందర్భంగా కేటీఆర్ ఎండగట్టారు.
హైదరాబాద్, నవంబర్ 09: తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ అని అభివర్ణించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల గొట్టే రాజ్యమని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో ఈ రెండేళ్లలో వేల ఇళ్లు కూల గొట్టారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి.. రేవంత్ రెడ్డికి గల్లి గల్లీలో చూపిస్తానని పేర్కొన్నారు.
నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కొట్టే దెబ్బతో సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఉంటుందో.. పోతుందో తెలియదని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ఈ రెండేళ్లలో అభివృద్ధి చేసి ఉంటే ఓటర్లకు కుక్కర్లు, చీరలు పంచె అవసరం ఏమి ఉందంటూ అధికార పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎంగా మూడేళ్లు ఉంటాడో మూడు నెలలు ఉంటాడో తెలియని పరిస్థితన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో నిధులు మంజూరు చేయడం లేదన్నారు. కొత్తగా జూబ్లీహిల్స్‌లో గెలిస్తే ఇక్కడ నిధులు ఇస్తారా? అంటూ కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సైతం ప్రభుత్వం పైసలు ఇవ్వట్లేదన్నారు. అలాగే కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు కూడా మంజూరు చేయడం లేదని గుర్తు చేశారు.
ఇలాంటి ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిధులు ఇస్తాడంటే నమ్మాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్స్ లేకుంటే సినిమా వాళ్ల మీద కేసులు పెడతారని తెలిపారు. అదే ఎలక్షన్స్ వచ్చాయంటే సినిమా వాళ్ళ కాళ్ళ మీద పడతారంటూ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని ఈ సందర్భంగా కేటీఆర్ ఎండగట్టారు. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్‌లో ఉన్న పోలీసులు సైతం ఆలోచన చేయాలని సూచించారు. ఈ దుర్మార్గ ప్రభుత్వానికి సహకరించకండంటూ పోలీసులకు కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పరాకాష్టకు చేరిన సీఎం రేవంత్ మూర్ఖత్వం: జగదీష్ రెడ్డి
ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు తథ్యం: టీపీసీసీ చీఫ్
For More TG News And Telugu News