Jubilee Hills bypoll: ఉప ఎన్నిక యుద్ధం.. ఈ నెల 11న సెలవు ప్రకటన
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:48 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 11న ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది వార్తలో చదవండి.
జూబ్లీహిల్స్ లో 11న సెలవు
10, 14 తేదీల్లో నిర్ణీత కేంద్రాలకు మాత్రమే
హైదరాబాద్ సిటీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills bypoll) నేపథ్యంలో ఈనెల 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవులు (Shool Holiday) ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కు ముందురోజు ఈ నెల 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, ఆఫీసులకు మాత్రమే సెలవు ఇవ్వగా.. పోలింగ్ రోజు 11వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆఫీసులకు, సంస్థలకు సెలవు ఇచ్చారు. కాగా, 14వ తేదీన కౌంటింగ్ నాడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట మాత్రమే సెలవు ప్రకటించారు. ఆయా చోట్ల పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉప ఎన్నిక కోసం పారామిలటరీ బలగాలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అవాంచనీయ ఘటనలకు తావివ్వకుండా పారామిలటరీ బలగాలను వినియోగిస్తున్నట్లు డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. 'ఆంధ్రజ్యోతి' ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలను పంచుకున్నారు.
సీఎం సహా ప్రముఖులు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖులు, మంత్రులు పాల్గొంటుండటంతో ఇందుకు తగ్గట్టు బలగాలను రంగంలోకి దించాం. పారామిలటరీ బలగాలతో పాటు 8 కంపెనీలకు చెందిన సీఐఎస్ఎఫ్ బృందాలు రానున్నాయి.
ప్రత్యేక ఫోర్స్..
నగర శాంతిభద్రతల విభాగానికి చెందిన 1600 మంది పోలింగ్ రోజున విధులు నిర్వహించనున్నారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 38 రూట్ మొబైల్స్, 8 స్ట్రైకింగ్ ఫోర్స్, 5 డీసీపీ, ఏసీపీల స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, 8 క్విక్ రియాక్షన్ టీమ్లు సిద్ధం చేశాం. 65 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. అంతే కాకుండా పది పోలింగ్ కేంద్రాలు 8 ప్రాంతాల్లో ఒకే భవనంలో ఉన్నట్టు గుర్తించాం. 7 పోలింగ్ కేంద్రాలు 6 ప్రాంతాల్లో ఒకే భవనంలో ఉన్నట్టు తేలింది. ఆయా ప్రాంతాల్లో భారీగా ఓటర్లు రానుండడంతో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
Hockey India: హాకీ ఇండియా సెంచరీ
2029 Womens World Cup: వచ్చేసారి పది జట్లు