Bihar Elections: టిక్కెట్ల కేటాయింపులపై కాంగ్రెస్ నేతల్లో నిరసన
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:34 PM
పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టి, డబ్బున్న అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపినట్టు శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ కాంగ్రెస్ (Congress)కు కొత్త తలనొప్పి ఎదురైంది. టిక్కెట్ల కేటాయింపులపై పలువురు నేతలు బహిరంగానే శనివారంనాడు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టి, డబ్బున్న అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు నాయకత్వం మొగ్గుచూపినట్టు శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ స్టేట్ రీసెర్చ్ సెల్ హెడ్ ఆనంద్ మాధవ్ సారథ్యంలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఇందులో పాల్గొన్నారు.
డబ్బున్న వాళ్ల వైపే మొగ్గు
ఏళ్ల తరబడి పార్టీ కోసం అట్టడుగు స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చిన వారిని నిర్లక్ష్యం చేస్తూ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారికే పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆనంద్ మాధవ్ విమర్శించారు. టిక్కెట్ల కేటాయింపులో బిహార్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ అల్లవరపు, రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. బిహార్ కాంగ్రెస్ కొద్దిమంది నేతలు (పర్సనల్ ఏజెంట్స్) చేతుల్లో చిక్కుకుందని, వారికి పార్టీ సిద్ధాంతాలపై నమ్మకాలు లేవని అన్నారు. రాహుల్ గాంధీ తమపై ఉంచిన విశ్వాసాన్ని కొందరు నేతలు దుర్వినియోగపరుస్తున్నారని, అట్టడుగు స్థాయి కార్యకర్తలకు సాధికారత కల్పించాలని రాహుల్ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయన మాటలను పెడచెవిని పెడుతున్నారని అసంతృప్తి నేతలు చెప్పారు.
కాగా, టిక్కెట్ కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తున్న అసంతృప్తులపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకూ ఎన్నికల్లో పోటీ చేసే 48 మంది అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం
ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లలో భారీ అగ్నిప్రమాదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి