Share News

PM Modi: మహాగట్‌బంధన్‌లో మహా పోరు.. సీఎం పోస్టును చోరీ చేసిన ఆర్జేడీ

ABN , Publish Date - Nov 02 , 2025 | 03:24 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఆర్జేడీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అయితే కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి మరీ సీఎం పోస్ట్‌ను ఆర్జేడీ చోరీ చేసిందని అన్నారు.

PM Modi: మహాగట్‌బంధన్‌లో మహా పోరు.. సీఎం పోస్టును చోరీ చేసిన ఆర్జేడీ
PM Modi

ఆరా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ఆరాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రచారం సాగించారు. విపక్ష మహాగట్‌బంధన్ (Mahagathbandhan)పై విమర్శలు గుప్పించారు. మహాకూటమిలో తీవ్రమైన అంతర్గత పోరు నెలకొందని అన్నారు. తమ సీఎం అభ్యర్థిత్వాన్ని అంగీకరించాలంటూ కాంగ్రెస్‌ మెడపై ఆర్జేడీ కత్తిపెట్టి మరీ బెదిరించిందని విమర్శించారు. బిహార్ అస్థిత్వాన్ని ఆర్జేడీ-కాంగ్రెస్ నాశనం చేయాలనుకుంటున్నాయని, ఆ రెండు పార్టీల ఉద్దేశాలను ఓటర్లు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.


బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఆర్జేడీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అయితే కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి మరీ సీఎం పోస్ట్‌ను ఆర్జేడీ చోరీ చేసిందని అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని, కాంగ్రెస్ డిమాండ్లు మహాగట్‌బంధన్ మేనిఫెస్టోలో చేటుచేసుకోలేదని చెప్పారు. ఎన్నికలకు ముందే ఆ పార్టీల మధ్య విద్వేషాలు చోటుచేసుకున్నాయని, ఎన్నికలు అయిన తరువాత ఒకరిపై మరొకరు తిరగబడటం ఖాయమని అన్నారు.


మహాకుంభమేళాను లాలూ అవమానించారని, అయితే ఆయన హయాంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఎందరు హిందువులు మరణించారో లెక్కలు కూడా చెప్పలేదని, అది పాపం కాదా అని మోదీ ప్రశ్నించారు. ఫ్యాక్టరీలకు తాళాలు వేసిన వాళ్లు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయగలరా అని నిలదీశారు. పాకిస్థాన్‌లో పేలుళ్లు జరిగితే కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీకి కంటిమీద కునుకు లేదని, ఇప్పటికీ పాకిస్థాన్, కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ 'ఆపరేషన్ సిందూర్‌' దెబ్బ నుంచి కోలుకోలేదని అన్నారు.


బీహార్‌లో ప్రతి పౌరునికి మెరుగైన వసతుల కల్పనకు ఎన్డీయే కట్టుబడి ఉందని అన్నారు. నాణ్యత కలిగిన రేషన్‌ బియ్యం నుంచి ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కల్పించేందుకు తాము నిబద్ధతతో ఉన్నామని అన్నారు. బీహార్ వేగాన్ని ఎవ్వరూ ఆపలేరని, ఈసారి భోజ్‌పూర్‌లో ప్రతి సీటు, ప్రతి బూత్‌‌లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి

ఈ నేరం ప్రేమతో జరిగింది.. కామంతో కాదు: సుప్రీంకోర్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 02 , 2025 | 03:25 PM