Share News

PM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్... తొలి ప్రచార సభలో మోదీ

ABN , Publish Date - Oct 24 , 2025 | 02:58 PM

విపక్ష మహాఘట్‌బంధన్‌పై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్‌ను లూటీ చేసిందని, ఇప్పుడు వీరంతా బెయిలుపై ఉన్నారని చెప్పారు.

PM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్... తొలి ప్రచార సభలో మోదీ
Bihar Assembly Elections

పాట్నా: జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత నితీష్ కుమార్ (Nitish Kumar) నాయకత్వంలో ఎన్డీయే కూటమి అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఆయన ఆమోదం తెలిపారు. సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం నుంచి మోదీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారంనాడు ప్రారంభించారు.


విపక్ష మహాఘట్‌బంధన్‌పై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్‌ను లూటీ చేసిందని, ఇప్పుడు వీరంతా బెయిలుపై ఉన్నారని చెప్పారు. బిహార్‌లో 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ 'జన్‌నాయక్' కావాలనుకుంటున్నారని పరోక్షంగా రాహుల్‌ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ చేతులు కలిపినా బిహార్ అభివృద్ధిని ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బిహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయేకు ఎలాంటి సాయం చేయవద్దని ఆర్జేడీ బెదిరించిందని చెప్పారు.


'కోట్లాది రూపాయలు కుంభకోణం చేసిన ఇదే వ్యక్తులు బెయిలుపై ఉన్నారు. వీరు కర్పూరీ ఠాకూర్ పేరును కూడా చోరీ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ తరహాలో కర్పూరి ఠాకూర్‌ను అవమానించడాన్ని బిహార్ ప్రజలు ఎన్నటికీ సహించరు' అని మోదీ అన్నారు.


ఎన్డీయేకు తిరిగి పట్టంకట్టండి

బిహార్‌లో ఎన్డీయేకి తిరిగి పట్టం కట్టాలని ప్రజలను ప్రధాని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే వృద్ధి రేటు మరింత వేగవంతమవుతుందన్నారు. బిహార్ ప్రజలు 'జంగిల్ రాజ్'ను తిప్పికొడుతూనే సుపరిపాలనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.


ఇంత వెలుతురు ఉంటే లైటు ఎందుకు?

బిహార్ వెలిగిపోతుంటే లాంతర్ (Lantern) ఎందుకని ఆర్జేడీ లాంతరు గుర్తును ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్స్‌ లైట్లు ఆన్ చేసుకోవాలన్నారు.. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతల్లో నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రతిపక్ష నేత అశోక్‌ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్‌ చుట్టూ..

తమ కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 03:49 PM