Bihar Elections: మరో ఛాన్స్ ఇవ్వండి.. నితీష్ వీడియో సందేశం
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:13 PM
రాష్ట్రీయ జనతాదళ్‌పై విమర్శలు గుప్పిస్తూ, 2005లో తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు బిహార్ పరిస్థితి అతి దయనీయంగా ఉండేదని, బిహారీలంటేనే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని నితీష్ చెప్పారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కి ఓటు వేసి గెలిపించాలని ముఖ్యమంత్రి, జేడీయూ (JDU) చీఫ్ నితీష్ కుమార్ (Nitish Kumar_ ప్రజలను కోరారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. రాష్ట్రాన్ని ఎన్డీయే మాత్రమే అభివృద్ధి చేయగలదని, తన హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు.
'ఎన్డీయే అభ్యర్థులను గెలిపించి మరోసారి మాకు అవకాశం ఇవ్వండి. గెలిచిన అనంతరం బిహార్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలుపుతాం' అని నితీష్ తెలిపారు. రాష్ట్రీయ జనతాదళ్‌పై విమర్శలు గుప్పిస్తూ, 2005లో తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు బిహార్ పరిస్థితి అతి దయనీయంగా ఉండేదని, బిహారీలంటేనే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం తాను రేయింబవళ్లు కష్టపడ్డానని వివరించారు.
విద్య, ఆరోగ్యం, యువతకు ఉపాధి అవకాశాలపై తమ ప్రభుత్వం ఎంతో చేసిందని, దళితులు, వెనుకబడిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేసిందని, బిహారీలకు గౌరవం తీసుకువచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం మహిళల కోసం చేసిందేమీ లేదని, మహిళా సాధికారత కోసం తాము విశేషమైన కృషి చేశామని చెప్పారు. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 6, 11న జరుగనుడగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఇతర పార్టీలతో పొత్తులు ఉండవు: ప్రశాంత్ కిశోర్
మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి