Karthika Pournami: ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:10 PM
కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఇళ్లు, దేవాలయాలు ఉదయం, సాయంత్రం దీపాలతో కళకళలాడుతుంటాయి. కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు దీపారాధన చేస్తే విశేష ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మాసాల్లో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఈ మాసంలో పరమ శివుడిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది. ఆ రోజు ఏం చేస్తే.. ఎలాంటి ఫలితం కలుగుతుందంటే..?
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడంటే..?
పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4వ తేదీ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. 5వ తేదీ సాయంత్రం 6.48 గంటలకు పౌర్ణమి ఘడియలు ముగుస్తాయి. నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌర్ణమి ఉంటుంది. అంటే పౌర్ణమి ఘడియల్లో సూర్యోదయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి.. అనంతరం 365 వత్తులతో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు. ఈ రోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పేర్కొంటున్నారు. ఇక ఈ రోజు దీపారాధన చేసి పరమ శివుడిని ఆరాధిస్తే.. పుణ్యం కలుగుతుందంటున్నారు.
సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఏ సమయంలో చేయాలి?
కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయాలనుకునే వారు నవంబర్ 5వ తేదీ ఉదయం 4. 52 గంటల నుంచి ఉదయం 5. 44 గంటల లోపు చేస్తే మంచిది. పూజ చేయడానికి ఉదయం 7. 58 గంటల నుంచి ఉదయం 9. 00 గంటల వరకు అనుకూలంగా ఉంది. సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం 5.15 గంటల నుంచి 7.05 గంటల వరకు ఉంది.
దీపారాధన.. ?
పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుంది. చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులు వెలిగిస్తారు. ఇలా ఈ ఒక్క రోజు దీపారాధన చేయడం వల్ల.. ఏడాదిలో మిగిలిన రోజులు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. అలాగే భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుందని విశ్వసిస్తారు.
365 వత్తులు ఎలా వెలిగించాలి..?
ఈ వత్తులతో దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కొవ్వొత్తులతో అస్సలు వెలిగించ కూడదు. అగరబత్తిని ఉపయోగించి ఈ వత్తులను వెలిగించాలి. అలా 365 వత్తులలో దీపారాధన చేయడం వల్ల ఇంటి యజమానికి అత్యత్తుమ ఫలితాలు లభిస్తాయి. ఇలా దీపారాధన చేసిన అనంతరం అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పుకోవాలి.
ఉసిరికాయలతో దీపారాధన..
ఈ పౌర్ణమి రోజు చాలా మంది ఉసిరికాయలతో దీపారాధన చేస్తారు. ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం వేళ దీపారాధన చేస్తారు. అలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయిని.. లక్ష్మీ దేవి అనుగ్రహం సైతం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా గోవర్ధన పూజ
For More Devotional News And Telugu News