Share News

Hare Krishna Golden Temple: హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా గోవర్ధన పూజ

ABN , Publish Date - Oct 22 , 2025 | 09:15 PM

ఇంద్రుడి ఆగ్రహం నుంచి బృందావన వాసులను రక్షించేందుకు దేవాధిదేవుడైన కృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సంఘటన, భక్తుల పట్ల భగవంతుడికి ఉన్న అపారమైన కరుణకు ప్రతీక అని ప్రభూజీ ప్రవచించారు.

Hare Krishna Golden Temple: హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా గోవర్ధన పూజ
Hare Krishna Golden Temple

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో శ్రీ గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన గోవర్ధన పర్వత ప్రతిరూపం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. పూజలో భాగంగా స్వామి వారికి 56 రకాల ఆహార పదార్థాలను నైవేధ్యంగా సమర్పించారు. ఉదయం కార్యక్రమాలు ఆలయ గోశాలలో గోపూజతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆవులు, దూడలకు శ్రీకృష్ణ ప్రసాదాన్ని సమర్పించారు.


మధ్యాహ్నం గోవర్ధన పర్వత ప్రతిరూపం ఆవిష్కరణ జరిగింది. ఆ తర్వాత అన్నకూట మహోత్సవంలో భాగంగా అనేక రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం ఆలయంలో భక్తి కీర్తనలు, పల్లకి ఉత్సవం, ఆలయ హారతులు కన్నుల పండుగగా జరిగాయి. హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్రదాస ప్రభూజీ గోవర్ధన లీలల ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి ప్రసంగించారు.


ఇంద్రుడి ఆగ్రహం నుంచి బృందావన వాసులను రక్షించేందుకు దేవాధిదేవుడైన కృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సంఘటన, భక్తుల పట్ల భగవంతుడికి ఉన్న అపారమైన కరుణకు ప్రతీక అని ప్రభూజీ ప్రవచించారు. గోవర్ధనగిరిని ఆరాధించిన వారికి ఆరోగ్యం, సంపద, శాంతి, శ్రేయస్సు తప్పక కలుగుతాయని ప్రభూజీ అన్నారు. కులం, మతం, వర్ణం, ప్రాంతం, దేశం అనే భేదాలు లేకుండా భక్తితో హరినామ సంకీర్తన చేయడం ద్వారా కృష్ణుడి దివ్యకరుణ అందరికీ లభ్యమవుతుందని చెప్పారు.


కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తులు కార్తీక దీపాన్ని వెలిగించి, యశోదా దామోదరునికి దామోదర హారతిని సమర్పించారు. “దామోదరాష్టకం” శ్లోకాలతో ఆలయ వాతావరణం భక్తి రసమయంగా రూపుదిద్దుకుంది. ప్రతి భక్తుడికి నెయ్యితో దీపారాధన చేసే అవకాశాన్ని కల్పించారు. అనంతరం భగవాన్ శ్రీకృష్ణుడి గోవర్ధన లీలల ఆధారంగా ఏర్పాటు చేసిన వీడియో ప్రదర్శన భక్తులందరినీ ఆకట్టుకుంది. చివరగా అందరికీ రుచికరమైన అన్నకూట ప్రసాదం వడ్డించబడింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి.


ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడి.. వెలుగులోకి భీకర దృశ్యాలు..

కర్ణాటకలో కామరాజ్‌ ప్లాన్.. కాంగ్రెస్ కసరత్తు

Updated Date - Oct 22 , 2025 | 09:15 PM