Drone Strike Hits Kindergarten: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడి.. వెలుగులోకి భీకర దృశ్యాలు..
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:55 PM
కిండర్‌గార్డెన్‌పై జరిగిన డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దాడి తాలూకా భీకర దృశ్యాలు ఉన్నాయి. చిన్నారులు భయంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగటం లేదు. తరచుగా ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూనే ఉన్నాయి. అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్నాయి. అభంశుభం తెలియని పసి పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన బాంబు దాడి సైతం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉక్రెయిన్‌లోని ఖార్ఖివ్‌లో బుధవారం నాడు రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఆ డ్రోన్ కిండర్‌గార్డెన్‌పై పడింది. దీంతో భారీ విధ్వంసం సంభవించింది. ఓ చిన్నారి చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
దాదాపు 50 మంది చిన్నారులను ప్రమాదం జరిగిన స్థలం నుంచి వేరే ప్రదేశానికి తరలించారు. కిండర్‌గార్డెన్‌పై రష్యా దాడి చేయడంపై జెలన్‌స్కీ స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘చిన్నారులందరినీ అక్కడి నుంచి తరలించాం. వారందరూ ప్రస్తుతం షెల్టర్లలో ఉన్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఏడుగురు గాయపడ్డారు. వారికి చికిత్స అందుతోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం చాలా మంది పిల్లలు భయాందోళనకు గురయ్యారు.
సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెబుతున్న వారందరి ముఖంపై రష్యా ఉమ్మేసింది. కిండర్‌గార్డెన్‌పై జరిగిన దాడిని ఏ విధంగా సమర్థించుకుంటారు. రష్యా మరింత బరితెగిస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దాడి తాలూకా భీకర దృశ్యాలు ఉన్నాయి. చిన్నారులు భయంతో వెక్కివెక్కి ఏడుస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మిరపకాయలతో దీపావళి సంబరాలు.. ఇతడి టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు..
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం..అప్రమత్తంగా ఉండండి : ఏపీ డిప్యూటీ సీఎం