Pawan Kalyan: ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి: ఏపీ డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:28 PM
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు.
విజయవాడ, అక్టోబర్ 22: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాలుపంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయిన పక్షంలో వాటిని తక్షణమే తొలగించాలని పవన్ సూచించారు. ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తన కార్యాలయ సిబ్బందికి పవన్ దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి