Hyderabad: నిర్మలా సీతారామన్ ఫొటోతో ప్రచారం..14.35 లక్షలు స్వాహా
ABN , Publish Date - Sep 17 , 2025 | 08:10 AM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోను డీపీగా పెట్టిన నేరగాళ్లు ఆన్‌లైన్ పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఓ ప్రకటనను సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. ఆ లింకును క్లిక్ చేసిన వృద్ధుడిని బురిడీ కొట్టించి రూ.14.35లక్షలు కొల్లగొట్టారు.
- 68 ఏళ్ల వృద్ధుడిని బురిడీ కొట్టించిన నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఫొటోను డీపీగా పెట్టిన నేరగాళ్లు ఆన్‌లైన్ పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఓ ప్రకటనను సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. ఆ లింకును క్లిక్ చేసిన వృద్ధుడిని బురిడీ కొట్టించి రూ.14.35లక్షలు కొల్లగొట్టారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత(Cyber Crime DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడు కాలక్షేపం కోసం సోషల్‌మీడియా చూస్తుండగా ఫేస్‌బుక్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోతో తయారు చేసిన ఒక ప్రకటన కనిపించింది.
తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు పొందే చాన్స్ అని అందులో ఉంది. వివరాలకు లింకు ఓపెన్ చేయండని పేర్కొన్నారు. అదంతా నిజమని నమ్మిన బాధితుడు లింకును ఓపెన్ చేయగానే గుర్తుతెలియని వ్యక్తులు లైన్‌లోకి వచ్చారు. యూకేలోని క్వాంటం ఏఐ కంపెనీలో పెట్టుబుడులు పెడుతున్నట్లు నమ్మబలికారు. ఊహించని లాభాలు వస్తాయని బురిడీ కొట్టించారు. మెల్లగా ముగ్గులోకి దింపి దశలవారీగా రూ. 14.35లక్షలు పెట్టుబడులు పెట్టించారు.
అతితక్కువ సమయంలోనే లాభాలతో రూ.36లక్షలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ఆప్షన్ క్లోజ్ చేశారు. ఏఐ కంపెనీ ఫైనాన్స్ డిపార్టుమెంట్ నుంచి నియా శర్మ పేరుతో ఓ మహిళ లైన్‌లోకి వచ్చింది. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.8లక్షలు పన్ను చెల్లించాలని షరతు పెట్టింది. తన వద్ద డబ్బులు లేవని వాటిలోనే మినహాయించుకొని మిగిలిన డబ్బు ఇవ్వాల్సిందిగా కోరాడు.

అందుకు నిబంధనలు ఒప్పుకోవని చెప్పడంతో ఇదంతా సైబర్ మోసంలా ఉందని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో రెండు నెలల క్రితం సీతారామన్ ఏఐ వీడియోను సృష్టించిన నేరగాళ్లు 71 ఏళ్ల రిటైర్డ్ మహిళా డాక్టర్‌ను బురిడీ కొట్టించి రూ. 20.13లక్షలు కొల్లగొట్టారు. ఇలాంటి ప్రచారాలు, మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News