Share News

Historical Debate on Kakatiya Origins: అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:15 AM

కాకతీయుల మూల పురుషుడు గుండన జన్మస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకర్తి అని, ఆ గ్రామం ఇప్పుడు కనిపించడం లేదని, కానీ, గత కాలంలో ...

Historical Debate on Kakatiya Origins: అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?

  • కాకర్తి ఎక్కడుందో గుర్తించకుండానే ఊహలా?

  • స్థపతి నాగిరెడ్డి ప్రతిపాదన ఆశ్చర్యకరం

  • చరిత్ర పరిరక్షణ వేదిక ప్రకటన

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకతీయుల మూల పురుషుడు గుండన జన్మస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ‘కాకర్తి’ అని, ఆ గ్రామం ఇప్పుడు కనిపించడం లేదని, కానీ, గత కాలంలో ఎన్నడో ఉండవచ్చని చరిత్రకారులు చెప్పడం ఊహ మాత్రమేనని చరిత్ర పరిరక్షణ వేదిక వ్యాఖ్యానించింది. చరిత్రకు సంబంధించిన ఆధారాల పేరిట కాల్పనిక ఊహలు జోడించడం చరిత్ర వక్రీకరణకు దారి తీస్తుందని పేర్కొంది. ‘కొండపల్లి సీమలో కాకతీయం’ పేరిట పురావస్తు, చరిత్రకారులను ఉటంకిస్తూ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై చరిత్ర పరిరక్షణ వేదిక పేరిట పూర్వ సంపాదకులు కె. రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌, ఆద్యకళ మూజియం డైరెక్టర్‌ జయధీర్‌ తిరుమలరావు, దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మణికొండ వేదకుమార్‌, పురావస్తు, మ్యూజియం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రంగాచార్యులు, చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన రామోజు హరగోపాల్‌, బీవీ భద్రగిరీశ్‌, కట్టా శ్రీనివాస్‌, టార్చ్‌ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ ఆర్య, తెలంగాణ పరిరక్షణ వేదికకు చెందిన పసునూరి రవీందర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కాకర్తి గ్రామం ఎక్కడ ఉందో గుర్తించకుండానే, శాసన పాఠాలు వెల్లడించకుండానే స్వకపోలకల్పిత చరిత్రను ధ్రువీకరించడం సముచితం కాదని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో లభించిన తామ్ర శాసనాల్లో పేర్కొన్న కొండపల్లిసీమ అంటే విజయవాడ పక్కన ఉన్న కొండపల్లి అంటున్నారని, కానీ, కోదాడకు 15 కిలోమీటర్ల దూరంలోని నేలకొండపల్లి ఎందుకు కాకూడదో మైసూరులోని భారత శాసనాధ్యయన శాఖ అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉందని డిమాండ్‌ చేశారు. కోదాడ శాసనాల్లో పేర్కొన్న గ్రామాల్లో యాతవాకిల్ల, లోచెరువులు, కుడకుడ, ఘట్టికల్లు, మూసీ నది ప్రవాహం సూర్యాపేట జిల్లాలో.. కాకర్తి చుట్టూ ఉన్న పాలేరు, జువ్విపాడు ఖమ్మం జిల్లాలో ఉన్నాయని, మిగతా గ్రామాల పేర్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే పరిశీలిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. క్రీ.శ. 900 సంవత్సరానికి ముందు కాకర్తి గ్రామం ఉండేదని ఊహించి స్థపతి నాగిరెడ్డి చెప్పడం సరికాదని, అది చరిత్ర ఆధారాలను విస్మరించడమేనని, ప్రతిపాదన తప్పుగా చేసి దాని కోసం ఇప్పుడు సదరు గ్రామాన్ని వెతుకుతున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని తప్పుబట్టారు. ఈ అంశం మైసూరులోని భారత పురావస్తు సర్వేక్షణ శాసన విభాగం డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి అభిప్రాయమా లేదా సంస్థ అధికారిక ప్రకటనా అని ప్రశ్నించారు.

Updated Date - Sep 17 , 2025 | 06:15 AM