Operation Sindoor Hits: సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:18 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని...
జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ ఇలియాస్ అంగీకారం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించాడు. ఈ మేరకు ఇలియాస్ మాట్లాడిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ నేలను కాపాడేందుకు మేం పోరుబాట పట్టాం. దీని సరిహద్దులను కాపాడేందుకు ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లలో పోరాడాం. సర్వం త్యాగం చేశాం. అయితే, మే 7న భారత దళాలు బహవల్‌పూర్‌పై దాడి చేసి, మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి’ అని ఆ వీడియోలో ఇలియాస్ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం బహవల్‌పూర్‌లో కరాచీ-తొర్ఖం హైవే(ఎన్‌హెచ్-5) వద్ద జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆపరేషనల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇందులో సుమారు 600 మంది ఉగ్రవాదులు ఉంటారు. ఉగ్రవాదులకు తరచుగా శిక్షణ కార్యక్రమాలను ఇందులో నిర్వహిస్తుంటారు.