Hyderabad: ఈ చిన్నారిని హత్య చేసిందెవరు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:30 AM
కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. పక్కా ప్లాన్ ప్రకారమే బాలికను హత్య చేసిన దుండగులు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
- బాలిక హత్య కేసులో చిక్కని ఆధారాలు
- తలలు పట్టుకుంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ: కూకట్‌పల్లి(Kukatpally)లో 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. పక్కా ప్లాన్ ప్రకారమే బాలికను హత్య చేసిన దుండగులు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేసినా ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో తలలు పట్టుకున్నట్లు తెలిసింది. ఐదేళ్ల క్రితం సంగారెడ్డి(Sangareddy) జిల్లా మునిపల్లి మండలం ముక్తా క్యాసారం నుంచి బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన కృష్ణ, రేణుక దంపతులకు శత్రువులు ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
40 మందిని విచారించిన పోలీసులు
హత్య జరిగి నాలుగురోజులు గడుస్తున్నా అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, కేసులో పురోగతి సాధించలేకపోవడంతో పోలీసులుపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాత పద్ధతిలో (హ్యూమన్ ఇంటలీజెన్స్) విచారణ జరుపుతున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుక స్నేహితులతో పాటు హత్య జరిగిన అపార్టుమెంట్ వాసులు సహా 40 మందికి పైగా విచారించినట్లు తెలిసింది. అయినా సరైన ఆధారాలు లభించలేదని సమాచారం. మరోవైపు కృష్ణ, రేణుక దంపతులు కూతురు అంత్యక్రియలు చేయడానికి సొంతూరువెళ్లి ఇంకా తిరిగిరాలేదు. గురువారం వారు పోలీసుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విచారిస్తే.. ఈ కేసులో ఏదైనా పురోగతి సాఽధించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
కుమార్తెనే ఎందుకు టార్గెట్ చేశారు..?
పక్కా పథకం ప్రకారమే ద్వేషం, పగతోనే బాలికను హతమార్చినట్లు భావిస్తున్న పోలీసులు.. దుండగులు ఆమెనే టార్గెట్ చేశారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కృష్ణ, రేణుకలపై పగ తీర్చుకోవడానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక బాలికపై కక్షసాఽధింపుతోనే దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణ కుటుంబంతో అంత పగ ఎవరితో ఉందో ఆరా తీస్తున్నారు. కృష్ణ ఇంటికి వచ్చింది ఎవరు? ఎందుకు చంపారు? ఎలా వచ్చారు? ఎలా వెళ్లారు? క్లూస్‌టీమ్, డాగ్స్ స్క్వాడ్‌కు దొరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News