Share News

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:00 AM

హిందూపురం పోలీసులు ఓ ఘరానా దొంగను పట్టుకున్నారు. అతని వయస్సు 39 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 55 దొంగతనాలు చేశాడు. దీంతో పోలీసులే అతడిని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

- తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌...

- అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పురం పోలీసులు

- రూ.40 లక్షల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

- వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌ కుమార్‌

పాత చోరీ కేసులను ఛేదించే క్రమంలో హిందూపురం పోలీసులు ఓ ఘరానా దొంగను పట్టుకున్నారు. కేవలం 39 ఏళ్ల వయసుకే ఏపీ, కర్ణాటకలోని పలు ప్రాంతాలలో ఏకంగా 55 దొంగతనం కేసులు ఉన్నాయి అతనిపై..! పేరు బండికాళ్ల రత్నరాజు అలియాస్‌ తేజ..! చుట్టూ పదిమంది కాపలా ఉన్నా.. ఇంట్లోకి చొరబడి లూటీ చేయగల ఇలాంటి దొంగను తమ సర్వీసులో చూడలేదని పోలీసులు అంటున్నారంటే.. అతని నేర ‘ఘనత’ ఏ స్థాయిదో తెలుసుకోవచ్చు. ‘పది మంది ముఠాతో వెళ్లినా.. ఒక్కడే ఇంట్లోకి చొరబడుతాడు. ఎత్తుకొచ్చిన సొమ్ములో కొంత బయట ఉన్నవారికి ఇస్తాడు. ఎక్కువ భాగం తానే తీసుకుంటాడు..! కష్టానికి తగ్గ ఫలితం మరి..! వీడు మామూలోడు కాదు..’ అని పోలీసులు అంటున్నారు. చోరీ సొమ్ముతో గుంటూరులో రూ.2 కోట్లు వెచ్చించి రెండు ఇళ్లను నిర్మిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

హిందూపురం(అనంతపురం): తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ చోరీలకు పాల్పడే ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను హిందూపురం పోలీసులు(Hindupuram Police) పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.40 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలు, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ సతీష్‌ కుమార్‌ బుధవారం వివరించారు.


pandu2.2.jpg

పట్టుబడినవారిలో గుంటూరు జిల్లా కేంద్రానికి చెందిన బండికాళ్ల రత్నరాజు అలియాస్‌ తేజ (ప్రస్తుతం పరిగి మండలం గొల్లపల్లిలో ఉంటున్నాడు), హిందూపురం మండలం హనుమేపల్లికి చెందిన బాబుప్రసాద్‌ (ప్రస్తుతం కర్ణాటకలోని విధురాశ్వత్థంలో ఉంటున్నాడు), హిందూపురం మండలం సంతేబిదునూరుకు చెందిన గంగరాజు, ఉప్పర సురేష్‌, గౌరీబిదునూరుకు చెందిన సిద్దిక్‌ సాబ్‌ ఉన్నారు. హిందూపురం సబ్‌ డివిజన్‌లో 2023 నుంచి ఇప్పటి వరకూ నమోదైన చోరీ కేసులను ఛేదించేందుకు పోలీసులు నిఘా వేశారు.


ఈ క్రమంలో సంతేబిదునూరుకు చెందిన పాత దొంగల ముఠా వెంట కొత్త వ్యక్తి తిరుగుతున్నాడని హిందూపురం అప్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులుకు సమాచారం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వచ్చింది గుంటూరుకు చెందిన రత్నరాజు అని, చోరీల కోసం హిందూపురం ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తున్నారని తేలింది. దీంతో రత్నరాజును కూడా సీఐ అదుపులోకి తీసుకున్నారు. రత్నరాజు హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి, మేళాపురంలో మూడేళ్ల క్రితం చోరీకి పాల్పడ్డాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.


pandu2.3.jpg

మిగిలిన ముఠా సభ్యులపై హిందూపురం వన్‌టౌన్‌ పరిధిలో రెండు, టూటౌన్‌ పరిధిలో మూడు, అప్‌గ్రేడ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రెండు, గోరంట్లలో రెండు, సోమందేపల్లి, లేపాక్షి, చిలమత్తూరు, కదిరి ఒక్కో చోరీ కేసు ఉన్నాయి. తమ విచారణలో నిందితులు నేరాలు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. వారి నుంచి 310 గ్రాములు బంగారం ఆభరణాలు, 3 కిలోలకుపైగా వెండి ఆభరణాలు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటక, ఏపీలో తాళం వేసిన ఇళ్లను ముందుగా గుర్తిస్తారు. పగటిపూట రెక్కి నిర్వహించి, రాత్రిపూట ఇళ్లలో చొరబడి చోరీలు చేస్తుంటారు. దొంగల ముఠాను పట్టుకుని, కేసులను ఛేదించిన డీఎస్పీ మహేష్‌, సీఐలు ఆంజనేయులు, కరీం, రాజగోపాల్‌, జనార్దన్‌, ఎస్‌ఐ శ్రీధర్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులను అందజేశారు.


వీడు మామూలోడు కాదు..

గుంటూరుకు చెందిన బండికాళ్ల రత్నరాజు అలియాస్‌ తేజ వయసు 39 సంవత్సరాలు. ఇతను స్కెచ్‌ వేశాడంటే ఇంటి చుట్టూ పది మంది కాపలా ఉన్నా లూటీ కావాల్సిందే అని పోలీసులు అంటున్నారు. ఇంత ఆరితేరిన దొంగను ఇప్పటి వరకు తాము చూడలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నమోదైన మొదటి కేసులో జైలుకు వెళ్లిన సమయంలో ఖైదీలతో పరిచయం పెంచుకున్నాడు. బయటకు వచ్చాక ఆ ఖైదీలు ఉంటున్న ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డాడు. మొదట తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రెక్కీ నిర్వహిస్తాడు.


ఒకటి రెండు రోజులు ఆ ఇళ్ల వద్ద పరిస్థితిని గమనిస్తాడు. ఇంటికిగాని, గేటుకుగాని తాళం వేసి ఉండి.. రెండు మూడు రోజులు పగలు, రాత్రి ఇంటి ముందు లైటు వెలుగుతూ ఉంటే.. ఆ ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుంటాడు. చోరీకి అనువైనదని భావిస్తాడు. ఆ తరువాత కొంతమంది దొంగలతో కలిసి ఇంటివద్దకు వెళ్తాడు. కానీ దొంగతనం చేసేది మాత్రం రత్నరాజు ఒక్కడే. పది మంది వెంట వెళ్లినా.. ఇంట్లోకి చొరబడి సొమ్ము తీసుకొచ్చేది అతనొక్కడే. ఎందుకంటే తన వెంట వచ్చిన దొంగలనే నమ్మడు. రత్నరాజుపై ఇప్పటి వరకూ 55 చోరీ కేసులు నమోదయ్యాయి. పోలీసుల దృష్టికి రానివి ఇంకెన్ని ఉంటాయో తెలియదు.


చోరీ సొమ్ముతో గుంటూరులో ఇళ్ల నిర్మాణం

ఇళ్లలో చొరబడి చోరీ చే సిన సొమ్ముతో తన సొంతూరు గుంటూరులో రత్నరాజు రెండు ఇళ్లను నిర్మిస్తున్నాడు. వీటి నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.2 కోట్లు ఖర్చయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ జిల్లా అధికారుల ద్వారా కోర్టు అనుమతితో ఇళ్లను అటాచ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ సతీ్‌షకుమార్‌ తెలిపారు.


యువ ఖైదీలే పెట్టుబడి

రత్నరాజు జైలుకు వెళ్లిన ప్రతి సందర్భంలో జైలులో ఉన్న యువఖైదీలతో పరిచయం పెంచుకుంటాడు. ఎక్కడ చోరీ చేస్తే బాగుంటుందని ఆరా తీస్తాడు. ఆ ప్రాంత పోలీసుల పనితీరు గురించి కూడా తెలుసుకుంటాడు. ఏ స్టేషన్‌ పరిధిలో పోలీస్‌ అధికారి గట్టిగా ఉన్నాడు అనే కోణంలో కూడా ఆరాతీస్తాడు. అన్నీ తెలుసుకుని.. జైలు నుంచి బయటికి వచ్చాక అనువైన ప్రాంతాలలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి లూటీ చేస్తాడు. చోరీ చేసిన సొమ్ములో కొంత మాత్రమే వెంట వచ్చిన తోడుదొంగలకు ఇస్తాడు. మిగిలిన సొమ్మంతా తానే తీసుకుంటాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

2030 నాటికి అమెజాన్‌ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు

3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 11:00 AM