Tummidihatti Barrage: 3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:11 AM
తుమ్మిడిహెట్టి బ్యారేజీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్‌కే అప్పగించింది...
ఏడాదిలోగా అనుమతులు సాధించాలి
ఆర్వీ అసోసియేట్స్‌కు బాధ్యతల అప్పగింత
హైదరాబాద్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్‌కే అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ సంస్థ సర్వే ప్రక్రియను ప్రారంభించింది. ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఈ డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. బ్యారేజీ ప్రతిపాదిత నిర్మిత ప్రదేశం నుంచి మైలారం గ్రామం దాకా 75 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ సర్వే, మైలారం నుంచి సుందిళ్ల బ్యారేజీ దాకా టన్నెల్ అలైన్‌మెంట్‌పై సర్వే కూడా ఆ సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. డీపీఆర్‌కు అనుమతులు సాధించే బాధ్యతను కూడా ప్రభుత్వం ఆ సంస్థకే అప్పగించింది. డీపీఆర్ తయారీని మూడు నెలల్లో, కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లోని వివిధ డైరెక్టరేట్ల నుంచి క్లియరెన్స్ తీసుకోవడం వంటి ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యారేజీని 148, 150, 152 మీటర్ల ఎత్తుతో కట్టడం వల్ల కలిగే ముంపుపై పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ఇప్పటికే అధ్యయనం చేసింది. ఈ విషయంలో నిపుణుల అంచనాలు, లెక్కలు సరైనవేనా? కావా? నిర్ధారించే బాధ్యతను కూడా ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్‌కే అప్పగించింది. కాగా, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి 2016 మార్చి 8న మహారాష్ట్రతో ఒప్పందం జరిగిన విషయం విదితమే. పర్యావరణ అనుమతి కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో బహిరంగ విచారణ జరగ్గా మహారాష్ట్రలో మాత్రం పూర్తికాలేదు. దాంతో తాజాగా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంటుంది. పలు అనుమతులు ఇదివరకే ఉండటంతో బ్యారేజీ ఎత్తును కేవలం ఒక మీటరు పెంచుకున్నా నిర్దిష్ట లక్ష్యం మేరకు నీటిని తరలించవచ్చని అధికారులు లెక్క వేశారు. దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే చాలని పలువురు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ జోలికి పోకుండానే తుమ్మిడిహెట్టి డీపీఆర్ సిద్ధం చేయాలని సూచనలు వస్తున్నాయి. అయితే కాళేశ్వరంలో భాగంగా అయితేనే ప్రాజెక్టు బెన్‌ఫిట్ కాస్ట్ రేషియో (ప్రాజెక్టుకు వెచ్చించేది ఎంత.. తిరిగి వచ్చేదెంత)పై కచ్చితంగా లెక్కలు సరిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు. మేడిగడ్డ నుంచైనా తుమ్మిడిహెట్టి నుంచైనా నీళ్లు అంతిమంగా చేరాల్సింది శ్రీపాద ఎల్లంపల్లికేనని, ఆ ప్రాజెక్టు వద్ద ఉన్న కాళేశ్వరం పంపులతో పాటు సుందిళ్ల బ్యారేజీని కూడా వాడుకుంటున్నప్పుడు తుమ్మిడిహెట్టి బ్యారేజీ కూడా కాళేశ్వరంలో భాగంగానే కడుతున్నామని ప్రభుత్వం మున్ముందు ప్రకటించనుంది. పుణె సీడబ్ల్యూపీఆర్‌ఎస్ చేస్తున్న అధ్యయనం పూర్తయిన తర్వాత వచ్చే నివేదికల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లు సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత నీటి నిల్వను గణనీయంగా తగ్గించుకొంటేనే బ్యారేజీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.