Trump Tariffs: భారత్, చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని ఈయూను కోరిన ట్రంప్
ABN , Publish Date - Sep 10 , 2025 | 09:59 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మాట వినిపిస్తున్నారు. ఒకపక్క భారత్‌తో స్నేహ సంబంధాలు ఉన్నాయని చెబుతూనే భారీ సుంకాలు విధిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా, భారత్, చైనాపై 100 శాతం సుంకాల ప్రతిపాదన తీసుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్(india), చైనా (china) విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు భారత్ మిత్ర దేశం అంటూనే 50 శాతం సుంకాలు విధిస్తున్నారు. అంతటితో ఆగకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై 100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU)ను కోరినట్లు తెలుస్తోంది. ఈ చర్య ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు.
వాషింగ్టన్‌లో అమెరికా, ఈయూ అధికారుల సమావేశంలో ట్రంప్ ఈ అభ్యర్థన చేశారని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఈయూ ఈ రెండు దేశాలపై సుంకాలు విధిస్తే, అమెరికా కూడా అదే స్థాయిలో సుంకాలు (Trump Tariffs) విధించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు.
ఇప్పటికే అమెరికా, భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది. దీంతో మొత్తం సుంకాలు 50 శాతం వరకు పెరిగాయి. ఈ సుంకాలను అన్యాయం, అసమంజసం అని భారత్ విమర్శించింది. అమెరికా, ఈయూ కూడా రష్యాతో (Russia) వాణిజ్యం కొనసాగిస్తుందని భారత్ తెలిపింది. 2024లో ఈయూ-రష్యా వాణిజ్యం 67.5 బిలియన్ యూరోలు (సుమారు 78.1 బిలియన్ డాలర్లు), 2023లో సేవల వాణిజ్యం 17.2 బిలియన్ యూరోలుగా ఉందని యూరోపియన్ కమిషన్ డేటా చెబుతోంది.
మాస్కోలో భారత రాయబార కార్యాలయం డేటా ప్రకారం, 2025 మార్చితో ముగిసిన ఏడాదిలో భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ప్రీ-పాండమిక్ వాణిజ్యం (10.1 బిలియన్ డాలర్లు) కంటే దాదాపు 5.8 రెట్లు ఎక్కువ. రష్యా చమురు ఎగుమతుల్లో అతిపెద్ద కొనుగోలుదారు చైనా. కానీ చైనా 30 శాతం సుంకాలతో తప్పించుకుంది. ఇది వాషింగ్టన్‌తో ఒప్పందం ద్వారా సాధ్యమైంది.
ట్రంప్ ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశం, ఉక్రెయిన్ యుద్ధాన్ని (Russia Ukraine War) ముగించేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచడం. గత నెలలో అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ సమావేశం జరిగినప్పటికీ, కాల్పుల విరమణకు సంబంధించి పెద్దగా పురోగతి రాలేదు. ఆ సమావేశం తర్వాత, పుతిన్ శాంతి కోసం సమస్యల మూల కారణాలను పరిష్కరించాలని అన్నారు. ట్రంప్ కూడా కొన్ని విషయాలపై ఒప్పందం కుదిరినప్పటికీ, పెద్ద అంశాల్లో పురోగతి సాధించలేదన్నారు.
మరోవైపు ట్రంప్ మంగళవారం రాత్రి X పోస్ట్‌లో భారత్‌తో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని, వాణిజ్య అడ్డంకులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మోదీని చాలా మంచి స్నేహితుడు అని పిలిచిన ఆయన, ఈ చర్చలు విజయవంతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు భారత్, చైనాలకు ఒక సవాలుగా మారాయని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి