Indian Stock Market Crash: ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లకు షాక్.. కుప్పకూలిన సూచీలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:05 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (సెప్టెంబర్ 26న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్‌ల విషయంతో భారతీయ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. ప్రధానంగా ఫార్మా సెక్టార్ మీద పెద్ద దెబ్బ పడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనలతో ప్రపంచ మార్కెట్లలో కలకలం రేగింది. ఇదే సమయంలో భారత్ స్టాక్ మార్కెట్లు కూడా దీని వల్ల తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి (Indian Stock Market Crash). అమెరికాలోకి వచ్చే ప్రతి బ్రాండెడ్, పేటెంట్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 100% టారిఫ్ విధించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ విధానం అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. అదేవిధంగా భారీ ట్రక్కులపై 25 శాతం, కిచెన్ క్యాబినెట్లపై 50 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.
మార్కెట్లపై ప్రభావం
ఈ ప్రకటనల తర్వాత భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నుంచి నెగిటివ్ ట్రెండ్‌లోకి వెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 381 పాయింట్లు (0.47%) పతనమై 80,777 స్థాయిలో ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 108 పాయింట్లు (0.43%) తగ్గి 24,872 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 332 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 450 పాయింట్లు పడిపోయింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.
ఈ కంపెనీలపై దెబ్బ
ఇదే సమయంలో నాట్కో ఫార్మా స్టాక్స్ 4% వరకు నష్టపోయింది. లారస్ ల్యాబ్స్, బయోకాన్, సన్ ఫార్మా, జైడస్ లైఫ్‌సైయెన్సెస్ వంటి ఫార్మా కంపెనీల స్టాక్స్ కూడా 2 నుంచి 4% వరకు పడిపోయాయి. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో Nifty Pharma Index మొత్తం 2% పతనమైంది. ఇది చిన్న కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% వరకు పడిపోయింది. 2025లో ఇప్పటి వరకు చిన్న కంపెనీల ఇండెక్స్ 5% నష్టపోయింది. దీంతో పోల్చితే మిడ్‌క్యాప్ 3% తగ్గగా, సెన్సెక్స్ మాత్రం 3% లాభాల్లో ఉంది. అంటే పెద్ద కంపెనీలు ఇంకా స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి