Nifty Record High: మళ్లీ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. రికార్డ్ స్థాయిలో నిఫ్టీ, ఇన్వెస్టర్లకు ఊరట
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:25 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 7న) వరుసగా రెండో రోజు పాజిటివ్ ట్రెండ్‌తో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 రెండూ కొత్త రికార్డుల్ని తాకాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత స్టాక్ మార్కెట్లు (stock markets) మంగళవారం (అక్టోబర్ 7, 2025) రెండో రోజు కూడా పాజిటివ్ ధోరణిలో కొనసాగాయి. ఈ క్రమంలో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 462.15 పాయింట్లు ఎగసి 82,252.27 స్థాయికి చేరుకుంది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 124.55 పాయింట్లు పెరిగి 25,197.70 వద్ద నిలిచింది. ఈ నిఫ్టి రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభపడ్డారు.
సెన్సెక్స్‌లో టాప్ గెయినర్స్, లూజర్స్ ఈ క్రమంలో సెన్సెక్స్‌లోని కంపెనీల్లో భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ వంటి షేర్లు 1.9 శాతం వరకు లాభాలను అందుకోగా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. వీటి పనితీరు మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలను చూపించింది.
మార్కెట్లలో ఉత్సాహం
ఈ క్రమంలో మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్100, స్మాల్‌క్యాప్100 సూచీలు వరుసగా 0.42 శాతం, 0.34 శాతం లాభాలతో ట్రేడయ్యాయి. సెక్టోరల్ సూచీల్లో నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.8 శాతం వరకు పెరిగి అగ్రగామిగా నిలిచాయి. కానీ నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 0.3 శాతం వరకు తగ్గాయి.
వొడాఫోన్ ఐడియా షేర్ల జోరు
వొడాఫోన్ ఐడియా షేర్లు మంగళవారం అద్భుత జోష్‌తో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 8 శాతం పెరిగి రూ. 9.2 వద్ద ఎనిమిది నెలల గరిష్ట స్థాయిని తాకింది. సెప్టెంబర్ నుంచి ఈ షేరు ధర ఏకంగా 42 శాతం పెరిగింది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి