Share News

OYO: పెళ్లి కాని జంటలకు నో ఎంట్రీ.. ఓయో కొత్త పాలసీ..

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:15 PM

ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ఓయో (OYO) కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. ఇక మీదట పెళ్లి కాని కపుల్స్‌కు ఓయోలో రూమ్ బుక్ చేసుకునే సదుపాయం ఉండదు.

OYO: పెళ్లి కాని జంటలకు నో ఎంట్రీ.. ఓయో కొత్త పాలసీ..
Oyo New Check-in Policy

ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ఓయో (OYO) కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. ఇక మీదట పెళ్లి కాని కపుల్స్‌కు ఓయోలో రూమ్ బుక్ చేసుకునే సదుపాయం ఉండదు. సవరించిన మార్గదర్శకాలు ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలోని అన్ని హోటళ్లలో తక్షణమే అమల్లోకి రాబోతున్నాయి. ఇక్కడి గ్రౌండ్ లెవెల్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ నిబంధనలు అన్ని నగరాల్లోని భాగస్వామ్య హోటళ్లలో అమలుచేస్తామని ఓయో కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే దేశవ్యాప్తంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆదివారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.


హాస్పిటాలిటీ చైన్ OYO తన భాగస్వామ్య హోటళ్ల కోసం చెక్-ఇన్ విధానాలను సవరించింది. సవరించిన కొత్త మార్గదర్శకాలు ఈ సంవత్సరమే అమలులోకి వస్తాయి. కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ ప్రకారం.. చెక్-ఇన్ సమయంలో అన్ని జంటలు చెల్లుబాటు అయ్యే రిలేషన్‌షిప్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. మీరట్ సహా అనేక నగరాల ప్రజల నుంచి పెళ్లి కాని జంటలకు ఓయోలో రూమ్‌లు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.


ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ మాట్లాడుతూ, “OYO సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను కొనసాగించడానికి కట్టుబడి ఉంది. మేము వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తాం. అలాగే పౌరసమాజ అభిప్రాయాలకు అనుగుణంగా చట్టప్రకారం మా బాధ్యతను మేం నిర్వర్తిస్తాం. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభవాన్ని అందించే బ్రాండ్‌గా ఉండాలనేది మా ధ్యేయం. అందుకే పాత విధానాన్ని సవరించి కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ తీసుకొచ్చాం.“


కస్టమర్లలో సంస్థపై విశ్వాసం కలిగించి బుకింగ్‌ల సంఖ్య పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఓయో సంస్థ. అయితే, రిలేషన్‌షిప్ ప్రూఫ్‌‌గా ఏ పత్రాలు చూపిస్తే చెల్లుబాటు అవుతుందనేది ఇంకా వెల్లడించలేదు.


దేశవ్యాప్తంగా అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓయో. అలాగే సంస్థ బ్రాండింగ్‌ని ఉపయోగిస్తున్న అనధికార హోటళ్లపైనా చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. పోలీసులు, హోటల్ భాగస్వాములు సురక్షితమైన ఆతిథ్యంపై ఉమ్మడి సెమినార్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Jan 05 , 2025 | 05:35 PM