Share News

56th GST Council Meeting: కొనసాగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కాసేపట్లో కీలక నిర్ణయాలు..

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:53 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈరోజు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

56th GST Council Meeting: కొనసాగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కాసేపట్లో కీలక నిర్ణయాలు..
56th GST Council Meeting

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్‌టీ కౌన్సిల్ 56వ సమావేశం జరుగుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ భేటీలో కేంద్రం ప్రతిపాదించిన జీఎస్‌టీ సంస్కరణలపై వీరు చర్చించనున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబ్‌లను తొలగించి.. 5 శాతం, 18 శాతం అనే రెండు శ్లాబులు మాత్రమే పన్ను రేట్లుగా ఉంచే ప్రతిపాదన (56th GST Council Meeting) ఉన్నట్లు తెలుస్తోంది. కొంత ప్రత్యేకమైన వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను వసూలు చేయాలనే ఆలోచనలో కౌన్సిల్ ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో వీటిపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.


ఇకపై రెండు శ్లాబులు..

ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాలుగా ఉన్న GST వ్యవస్థను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కేవలం రెండు ప్రధాన శ్లాబ్‌లుగా అంటే 5 శాతం, 18 శాతం వైపు మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల పలు వస్తువులపై పన్ను తగ్గే అవకాశం ఉంది.

అత్యవసర వస్తువుల ధరపై..

వస్తువులను రెండు భాగులుగా ఒకటి మెరిట్ అంటే అత్యవసర వస్తువులు, మరోటి స్టాండర్డ్ అంటే సాధారణ వస్తువులుగా విభజించారు. అయితే వీటిపై ఉన్న పన్నును తగ్గించి సామాన్యులపై భారం తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో అత్యవసరమైన వస్తువులపై పన్నును 5 శాతం వరకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది.


ఈ వస్తువుల ధర పెరిగే అవకాశం..

కేంద్రం తీసుకునే నూతన ట్యాక్స్ విధానంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా పొగాకు, ఆల్కహాల్, లగ్జరీ కార్లు వంటి వస్తువుల మీద ప్రత్యేకంగా 40 శాతం ట్యాక్స్ విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి.


ఇన్సూరెన్స్ పై GST మినహాయింపు?

ప్రస్తుతం జీవన, ఆరోగ్య బీమాలపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం పన్ను విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కేంద్రం ఒక మెట్టు దిగి ప్రజలకు ఈ భీమాలపై పన్ను రాయితీ కలిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సామాన్యులపై భారం తగ్గడంతో పాటు భీమాలు తీసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

అమెరికా టారిఫ్‌లకు సమాధానంగా...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై విధించిన 50 శాతం టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఈ నూతన పన్ను మార్పులు తోడ్పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ జీఎస్టీలలో మార్పులు జరిగితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న రూ. 48 బిలియన్ల విలువ గల వస్తువులపై భారం తగ్గి కొంతమేర ఉపశమనం దక్కనుంది.


బలమైన బూస్ట్

2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ GDP 7.8 శాతం పెరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న జీఎస్టీ మార్పులతో ధరలు తగ్గుతాయి. దీంతో ఖర్చు చేసే ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతుందని.. దీని ద్వారా మన దేశ జీడీపీ మరింత బలపడుతుందని కేంద్రం ఆశిస్తోంది.

SBI రీసెర్చ్ ప్రకారం...

GST మార్పులు, ఆదాయపు పన్ను తగ్గింపుల వల్ల రూ.5.31 లక్షల కోట్లు వినియోగం పెరిగే అవకాశం ఉందని SBI రీసెర్చ్ అంచనా వేసింది. ఇది దేశ GDPలో 1.6% పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని తెలిపింది.


ఆత్మనిర్భర్ భారత్ దిశగా..

ఈ రివిజన్లు మూడు ముఖ్యమైన పాయింట్లపై ఆధారపడి ఉన్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలు, రేట్ల సరళీకరణ, ఈజ్ ఆఫ్ లివింగ్. ఇది దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దే విషయంలో కీలక నిర్ణయమని చెప్పవచ్చు.

రాష్ట్రాల అభ్యంతరాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ మార్పులను ఒప్పుకునే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్రాలకు వచ్చిన రెవెన్యూ లోటు ఎలా భర్తీ చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడం. దీనికి సంబంధించి రాష్ట్రాలతో కేంద్రం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఏదిఏమైనప్పటికీ GSTలో ఈ మార్పులు రావడం ద్వారా ధరలు తగ్గి సామాన్యులకు నేరుగా ప్రయోజనం జరిగే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 04:32 PM