Gold GST Rates: కొత్త జీఎస్టీ తర్వాత బంగారం, వెండి ఆభరణాలపై రేట్లు ఎలా ఉంటాయ్..
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:29 PM
దేశంలో కొత్త జీఎస్టీ నిబంధనలు మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల అనేక ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా, వీటిపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మన దేశంలో సెప్టెంబర్ 22, 2025 నుంచి జీఎస్టీ వేరే లెవెల్‌కి వెళ్లనుంది. ఎందుకంటే ఇటీవల 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో దేశంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న 5, 12, 18, 28 శాతం నాలుగు శ్లాబ్‌లను తగ్గించి ఇకపై రెండు ప్రధాన జీఎస్టీ రేట్లు 5, 18 శాతంలను అమలు చేయనున్నారు. మరోవైపు కొన్ని ఖరీదైన లగ్జరీ వస్తువులకు ప్రత్యేకంగా 40 శాతం ట్యాక్స్ ప్రవేశపెట్టారు. ఇందులో హైఎండ్ కార్లు, సిగరెట్లు, తంబాకు వంటివి ఉన్నాయి.
ఇది జీఎస్టీ విధానంలో జరిగిన అతిపెద్ద రిఫార్మ్ అని చెప్పవచ్చు. రోజువారీ గృహ అవసరాలకు సంబంధించిన చాలా ఉత్పత్తులు ఇకపై తక్కువ పన్ను శ్లాబ్‌లోకి వస్తాయి. అంటే అవి చౌకగా దొరకనున్నాయి. కానీ, ఇక్కడ బంగారం, వెండి ఆభరణాలపై మాత్రం జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. బంగారం, వెండిపై జీఎస్టీ 3 శాతం వద్దనే ఉంటుంది. అదనంగా మేకింగ్ చార్జీలపై 5 శాతం జీఎస్టీ కూడా అలాగే కొనసాగుతుంది. గోల్డ్ కాయిన్స్, బార్‌లపై కూడా 3% జీఎస్టీనే ఉంటుంది.
అంటే కొత్త GST రిఫార్మ్స్ వల్ల బంగారం, వెండి డిమాండ్‌పై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రకటన తర్వాత మార్కెట్‌లో కొంత హెచ్చుతగ్గులు కనిపించాయి. MCX గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 1 శాతం కంటే ఎక్కువ తగ్గిపోయి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో 10 గ్రాములకు రూ.1,06,207 వద్ద ట్రేడైంది.
అదే సమయంలో MCX సిల్వర్ డిసెంబర్ డెలివరీ 1.04 శాతం తగ్గి, కిలోకు రూ.1,24,563 స్థాయిలో ఉంది. కొత్త జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల రోజువారీ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ బంగారం, వెండి ఆభరణాల ధరల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి