IRDAI Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియం పెంపుదలను IRDAI నియంత్రిస్తుందా..
ABN , Publish Date - Aug 23 , 2025 | 02:50 PM
మీరు ఎప్పుడైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు మొదట్లో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఏడాది, రెండేళ్లు గడిచాక ఆ ప్రీమియం ఒక్కసారిగా పైపైకి చేరుతుంది. దీనిపై IRDAI కొత్త రూల్ తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య బీమా (Health Insurance) ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరంగా మారింది. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రి ఖర్చులు వందల్లో కాదు, వేలల్లో, లక్షల్లో ఉంటున్నాయి. అందుకే చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా, మొదట పాలసీ తీసుకున్నప్పుడు బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. కానీ తర్వాత కొన్ని సంవత్సరాల్లో అది భారీగా పెరిగిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కొత్త నిబంధనలు తీసుకొస్తోందని తెలుస్తోంది.
ఎందుకు పెరుగుతున్నాయి?
ఆరోగ్య బీమా కంపెనీలు కొన్నిసార్లు మొదట్లో చాలా తక్కువ ప్రీమియంతో పాలసీలను అందిస్తాయి. ఇంత తక్కువ ధరలో ఇంత మంచి కవరేజ్ దొరుకుతోందా? అని మనం సంతోషపడతాం. కానీ, ఒకటి రెండు సంవత్సరాల తర్వాత ప్రీమియం మొత్తం ఒక్కసారిగా పెరిగిపోతుంది. చాలామందికి ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాలసీని కొనసాగించడం కూడా భారమైపోతుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు IRDAI ఇప్పుడు కొత్త ఆలోచనలు చేస్తోంది.
IRDAI ఏం చేయబోతోంది?
తాజా సమాచారం ప్రకారం IRDAI ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుదలపై ఒక పరిమితిని విధించాలని యోచిస్తోంది. అంటే, ఇకపై బీమా కంపెనీలు తమ ఇష్టానుసారం ప్రీమియంలను భారీగా పెంచలేవు. ఈ నిబంధన వ్యక్తిగత పాలసీలకు మాత్రమే కాకుండా, మొత్తం బీమా ఉత్పత్తుల సమూహానికి (పోర్ట్‌ఫోలియో) కూడా వర్తిస్తుందని తెలుస్తోంది. దీనివల్ల బీమా కస్టమర్లకు ఊరట లభించనుంది.
ఈ నియమాలను ఖరారు చేసేందుకు IRDAI త్వరలో ఒక కన్సల్టేషన్ పేపర్ విడుదల చేయనుంది. ఈ పేపర్‌లో ప్రీమియం పెంపుదలకు సంబంధించిన స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉంటాయి. ఇది ఆరోగ్య బీమా రంగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, ఎక్కువ మంది బీమా పాలసీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
ఈ ఏడాది ప్రారంభంలో, IRDAI సీనియర్ సిటిజన్ల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుదలను 10%కి పరిమితం చేసింది. అంటే, బీమా కంపెనీలు ఈ వయస్సు వారి ప్రీమియంను ఏటా 10% కంటే ఎక్కువ పెంచకూడదు. ఈ నిబంధన వల్ల వృద్ధులు ఊహించని ప్రీమియం పెరుగుదల భారం నుంచి ఉపశమనం పొందారు.
కానీ, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీనియర్ సిటిజన్ల ప్రీమియంలను పరిమితం చేయడం వల్ల బీమా కంపెనీలు ఆ నష్టాన్ని సరిచేయడానికి 60 ఏళ్ల లోపు వారి ప్రీమియంలను ఎక్కువగా పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే IRDAI ఇప్పుడు అన్ని వయసుల వారికీ వర్తించేలా ఒక సమగ్ర నిబంధనను తీసుకొస్తోంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి