Kasparov-Gukesh: తను అందరికంటే టాప్ అన్న విషయాన్ని గుకేశ్ రుజువు చేసుకోవాలి: గ్యారీ క్యాస్పరోవ్
ABN , Publish Date - Aug 23 , 2025 | 02:17 PM
గుకేశ్ ప్రస్తుతం అత్యంత గొప్ప ప్లేయర్ ఏమీ కాదని చెస్ లెజెండ్ గ్యారీ క్యాస్పరోవ్ అన్నారు. ఇతర ఆటగాళ్లపై అతడు తన ఆధిపత్యాన్ని ఇంకా రుజువు చేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: చెస్ ప్రపంచంలో మాగ్నస్ కార్ల్‌సన్ తరువాత ఎవరన్న ప్రశ్న ఈ మధ్య తరచూ వినిపిస్తోంది. పలువురు యువ క్రీడాకారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన భారతీయ క్రీడాకారుడు గుకేశ్ దొమ్మరాజు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. గతేడాది 18 ఏళ్ల చిరుప్రాయంలో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ గెలిచి అరుదైన గుర్తింపును పొందాడు.
ప్రస్తుతం జరుగుతున్న సింక్‌ఫీల్డ్ టోర్నమెంట్‌లో గుకేశ్ పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో గుకేశ్ ప్రదర్శన గురించి చెస్ లెజెంట్ గ్యారీ క్యాస్పరావ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మాట వాస్తవమే కానీ అతడిని ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆటగాడని అనలేము. ఎవరీ మనసు నొప్పించాలని నా ఉద్దేశం కాదు కానీ కార్ల్‌సన్‌తోనే ప్రపంచ ఛాంపియన్‌ల శకం ముగిసింది. గుకేశ్ సాధించిన ప్రపంచ ఛాంపియన్ షిప్ భిన్నమైనది. మాగ్నాస్‌యే అత్యంత శక్తిమంతమైన క్రీడాకారుడని రుజువైంది’
‘ఇతరుల కంటే తను అధికుడినన్న విషయాన్ని గుకేశ్ ఇంకా రుజువు చేసుకోవాల్సి ఉంది. తన వయసులోని వారిపైనా ఆధిపత్యం సాధించాల్సి ఉంది. ఉదాహరణకు సింక్‌ఫీల్డ్ కప్ తొలి రౌండ్‌లో ప్రజ్ఞానంధతో ఆటను డ్రాగా ముగించడం మెచ్చుకోదగినదిగా లేదు. ఇలా అంటున్నందుకు మళ్లీ మళ్లీ సారీ చెబుతున్నా. కానీ నేను, కార్పోవ్, ఫిషర్, మాగ్నస్ గెలుచుకున్న టైటిల్ వంటిది ఇది కాదు’ అని అన్నారు.
చెస్ లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న గ్యారీ క్యాస్పరోవ్ ఏకంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. ఇందులో నాలుగు సార్లు అనటోలీ కార్పావ్‌పై గెలిచి ఛాంపియన్‌గా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్, నైజెల్ షార్ట్‌పై కూడా పైచేయి సాధించి వరల్డ్ ఛాంపియన్ టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. బాబీ ఫిషర్, మాగ్నస్ కార్ల్‌సన్, గ్యారీ క్యాస్పరోవ్‌ను జనాలు ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌గా పరిగణిస్తారు. చెస్ చరిత్రలోనే గ్యారీ క్యాస్పరోవ్ అతిగొప్ప ప్లేయర్ అని కార్ల్‌సన్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి