India Economy: 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:21 PM
భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 2038 నాటికి మన భారత్, కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందట. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇప్పటివరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న ఇండియా, త్వరలోనే ప్రపంచంలో టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవబోతోంది. ఈ విషయం ఏదో ఊహ కాదు... ప్రముఖ అంతర్జాతీయ కాంపెనీ EY (Ernst & Young) తాజా నివేదిక ప్రకారం, 2038 నాటికి భారతదేశం కొనుగోలు శక్తి సమతుల్యత (PPP - Purchasing Power Parity) ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది.
PPP అంటే ఏంటి?
కొంతమందికి PPP అన్న పదం కొత్తగా అనిపించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక్కో దేశంలో ఒకే తరహా వస్తువులకు ఉన్న ధరల తేడా ఆధారంగా ఆ దేశం ఆర్థిక శక్తిని అంచనా వేస్తారు. దీనివల్ల వాస్తవానికి ప్రజలు ఎంత కొనగలుగుతున్నారన్న దాని మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ EY నివేదిక IMF (International Monetary Fund) అంచనాల ఆధారంగా రూపొందించబడింది. 2030 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ (PPP ప్రకారం) $20.7 ట్రిలియన్ స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇది అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి పెద్ద దేశాల కంటే ఎక్కువ కావడం విశేషం.
భారత్ ఎదుగుదలకు కొన్ని ప్రత్యేక కారణాలు:
యువ జనాభా: 2025 నాటికి భారత జనాభా మాధ్య వయస్సు 28.8 సంవత్సరాలు మాత్రమే. ఇది పని చేయగల శక్తివంతమైన వయస్సు.
ఉన్నత ఆదాయం & పొదుపు రేటు: భారత్లో పొదుపు చేయడానికీ పెట్టుబడులకు మంచి ఆదరణ ఉంది.
కరెంట్ అకౌంట్ స్థిరత్వం: ప్రభుత్వ రుణం జీడీపీతో పోల్చినప్పుడు 2024లో 81.3% ఉండగా, 2030 నాటికి అది 75.8%కి తగ్గే అవకాశం ఉంది.
ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉంది?
చైనా ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది (PPP ప్రకారం), అయితే వారిలో వృద్ధాప్య జనాభా పెరగడం, ప్రభుత్వ రుణం పెరగడం వంటి సవాళ్లు ఉన్నాయి.
అమెరికా మంచి స్థితిలో ఉన్నా, వారి రుణం జీడీపీ కంటే 120% ఎక్కువగా ఉంది. జర్మనీ, జపాన్ వంటి దేశాలు వృద్ధ జనాభా, గ్లోబల్ ట్రేడ్‌పై ఎక్కువ ఆధారపడటం వల్ల కొంత పరిమితుల మధ్య కొనసాగుతున్నాయి.
వికసిత భారత్ 2047
EY నివేదిక ప్రకారం, మనం టెక్నాలజీ, మానవ వనరులు, పెట్టుబడుల పరంగా ముందుకు సాగుతున్నాం. మార్పుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతోంది. భారత్‌కు ఉన్న యువశక్తి, పెట్టుబడుల అవకాశాలు, స్థిరమైన అప్పు పరిమితి ఇవన్నీ గ్లోబల్ అస్థిరత ఉన్నా మనకు మంచి వృద్ధిని కలిగిస్తాయని నివేదిక అంచనా వేస్తోంది. 2028 నాటికి మార్కెట్ ఎక్స్ఛేంజ్ రేట్ ప్రకారం జర్మనీని దాటి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి