GST Reduction CRISIL: జీఎస్టీ తగ్గింపుతో భారత కంపెనీల ఆదాయం 7 శాతం పెరుగుతుంది
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:09 PM
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల ఆదాయం 6 నుంచి 7 శాతం పెరగబోతోందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజా రిపోర్ట్ చెబుతోంది. ఇందుకు కారణం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST)రేట్ల తగ్గింపు. దీంతోపాటు ఈ నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించింది. అవేంటో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్(CRISIL) ఇంటెలిజెన్స్ తాజాగా కీలక విషయాలను ప్రకటించింది. భారత్‌లో కార్పొరేట్ కంపెనీల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం 6-7 శాతం పెరిగే అవకాశముందని తెలిపింది. దీనికి ప్రధాన కారణం వస్తు, సేవల పన్ను (GST) రేట్లు తగ్గించడమే. వస్తువుల ధరలు తగ్గితే వినియోగదారులు రిలీఫ్ పొందుతారు, దీంతో కంపెనీలు అమ్మకాలు పెంచుకుంటాయి, ఆ క్రమంలో దేశ ఆదాయం కూడా పెరుగుతుందని క్రిసిల్ వెల్లడించింది.
వినియోగదారులకు గుడ్ న్యూస్
జీఎస్టీ తగ్గింపు వల్ల FMCG (Fast Moving Consumer Goods), కన్జూమర్ డ్యూరబుల్స్ (ఫ్రిజ్, టీవీ, ఏసీ వంటివి), ఆటోమొబైల్స్ రంగాల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ చెబుతోంది. దీని వల్ల వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో ఇది బాగా ఉపయోగపడుతుందని అంచనా.
కంపెనీలకు లాభాలు
కంపెనీల ఆదాయం పెరుగుతున్నా లాభాలు మాత్రం పెద్దగా పెరగకపోవచ్చని రిపోర్ట్ చెబుతోంది. కారణం, జీఎస్టీ యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధన. అంటే కంపెనీలు పన్ను తగ్గిన ప్రయోజనాన్ని వినియోగదారులకు మళ్లీ ఇచ్చేలా చూడాలి. అంటే ఆ లాభాన్ని వాళ్ల దగ్గరే పెట్టుకోవద్దని కేంద్రం సూచించింది.
ఎయిర్ లైన్స్ రంగం
ఎయిర్ లైన్స్ విషయానికి వస్తే ఎకానమీ క్లాస్ టిక్కెట్లపై జీఎస్టీ రేటు గతం మాదిరిగానే 5 శాతం ఉంది. కానీ బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టిక్కెట్లపై 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ ఆదాయంలో 92 శాతం ఎకానమీ క్లాస్ నుంచే వస్తుంది. కాబట్టి ఈ పెరుగుదల పెద్దగా ప్రభావం చూపదని రిపోర్ట్ చెప్పింది.
ఆటోమొబైల్ రంగం
ఇంజిన్ సామర్థ్యం 350 సీసీకి లోపల ఉన్న ద్విచక్రవాహనాలపై జీఎస్టీ తగ్గడంతో (ఇవి మార్కెట్‌లో దాదాపు 90 శాతం ఉంటాయి) వీటి ధరలు తగ్గి అమ్మకాలు పెరగొచ్చని అంచనా.
వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగానికి సంబంధించి జీఎస్టీ తగ్గితే వ్యాపారం మరింత సులభంగా కొనసాగుతుంది. ఇది కొన్ని సబ్‌సెక్టర్లు, గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ పెరగడానికీ అవకాశం ఉంటుంది.
నిర్మాణ రంగం
సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్‌పై జీఎస్టీ తగ్గింది. దీని వల్ల బిల్డింగ్ ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా, మధ్యతరగతి కుటుంబాలు తమ డ్రీమ్ హౌస్‌కి కొంచెం ఎక్కువ సౌకర్యాలు కలిపే అవకాశం ఉంది.
హోటల్ రంగం
రూ. 7,500 లోపు హోటల్ గదులపై జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ఇది హోటల్, ట్రావెల్, ట్రాన్స్‌పోర్ట్ రంగాలకు ఊరటనిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి జీఎస్టీ మార్పులు అన్ని రంగాల మీద సానుకూల ప్రభావం చూపుతాయని క్రిసిల్ రిపోర్ట్ చెబుతోంది. వినియోగదారులకు రిలీఫ్, కంపెనీలకు అవకాశంగా మారనుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి