ESI Benefits Aadhaar: ఈఎస్ఐ ప్రయోజనాలకు ఆధార్ తప్పనిసరి కాదు..కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:30 PM
మీరు ఈఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఇటీవల ఆధార్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఈఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలో పనిచేస్తున్నారా. అయితే ఈ వార్త గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) దీని గురించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ESI స్కీమ్ కింద ప్రయోజనాలు పొందడానికి ఆధార్ (ESI Benefits Aadhaar) ధృవీకరణ తప్పనిసరి కాదని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ESI స్కీమ్ అంటే ఏంటి?
ESI స్కీమ్ నెలకు రూ. 21,000 వరకు జీతం పొందే ఉద్యోగుల కోసం రూపొందించబడింది. ఈ స్కీమ్ ద్వారా మీరు, మీ కుటుంబం కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వాటిలో
మెడికల్ సంరక్షణ: ఆసుపత్రి ఖర్చులు, డాక్టర్ సంప్రదింపులు, మందులు కవర్ అవుతాయి
మాతృత్వ సౌకర్యాలు: గర్భిణీ స్త్రీలకు ఆర్థిక, వైద్య సహాయం
అనారోగ్యం లేదా ఉద్యోగ నష్టం సమయంలో ఆదాయ సహాయం: జీవనోపాధి కోల్పోయినప్పుడు కొంత ఆర్థిక భరోసా
ఆధార్ తప్పనిసరి కాదని ఎలా చెప్పారు?
ఆగస్టు 18న కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం, ఆధార్ ధృవీకరణ లేకపోయినా ESI ప్రయోజనాలు ఎవరికీ నిరాకరించబడవు. అంటే, మీకు ఆధార్ కార్డు లేకపోయినా లేదా ఆధార్ లింక్ లేకున్నా కూడా మీకు వైద్య సహాయం, నగదు ప్రయోజనాలు సజావుగా అందుతాయి. ఈ క్రమంలో మీరు ఆధార్ బదులు వేరే గుర్తింపు కార్డులను (పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్) ఉపయోగించుకోవచ్చు.
ఆధార్ లింక్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి?
ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కాకపోయినా, దాన్ని ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆధార్ లింక్ చేస్తే ఒక్క ఆధార్‌తో చాలా పనులు సులభంగా జరుగుతాయి. మీకు సహాయం త్వరగా అందుతుంది. ఒకే వ్యక్తి పేరుతో రెండు సార్లు ప్రయోజనాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. రికార్డులు సరిగ్గా ఉంటాయి, పారదర్శకత పెరుగుతుంది.
కొత్త స్కీమ్‌లు
ESI స్కీమ్‌ను మరింత విస్తరించడానికి, మరింత మంది ఉద్యోగులు, యజమానులు ఈ స్కీమ్‌లో చేరేలా చేయడానికి ESIC రెండు కొత్త స్కీమ్‌లను ప్రకటించింది.
1. SPREE 2025 (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్)
వ్యవధి: జులై 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు
లక్ష్యం: రిజిస్టర్ కాని యజమానులు, ఉద్యోగులను ESI స్కీమ్‌లో చేర్చడం.
2. అమ్నెస్టీ స్కీమ్ 2025
వ్యవధి: అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు
లక్ష్యం: ESI యాక్ట్, 1948 కింద పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించడం, కంపెనీలకు ఇది ఒక మంచి అవకాశం
ఈ రెండు స్కీమ్‌లు ESI కవరేజీని పెంచడానికి, మరింత మందికి ప్రయోజనాలు అందేలా చేసేందుకు తీసుకొచ్చారు
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి