New GST Rates: కార్ల నుంచి లగ్జరీ బైక్‌ల వరకు..40 శాతం జీఎస్టీ శ్లాబ్ గురించి తెలుసా
ABN , Publish Date - Sep 04 , 2025 | 09:12 PM
ఇటీవల జీఎస్టీ మార్పులు మన జీవనశైలిపై ప్రభావం చూపబోతున్నాయి. రోజువారీ ఉత్పత్తుల ధరలు చౌకగా మారడం సంతోషకరం. కానీ లగ్జరీ వస్తువులు మాత్రం మరింత ఖరీదైనవిగా మారబోతున్నాయి. అయితే వాటిలో ఎలాంటివి ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నిన్న(సెప్టెంబర్ 9న) కీలకమైన మార్పులను ప్రకటించారు. ఈ మార్పులు మన రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువుల ధరలపై ప్రభావం చూపబోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వస్తువులు చౌకగా మారుతుండగా, మరికొన్నింటి ధరలు మాత్రం భారీగా పెరగబోతున్నాయి.
కొత్త మార్పులు ఏంటి
ఈ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో పన్ను శ్లాబులను మార్పు చేశారు. గతంలో నాలుగు శ్లాబులు ఉండగా వాటిలో 12, 28 శాతం శ్లాబ్‌లను తీసేసి, కేవలం 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంచారు. దీంతోపాటు కొత్తగా 40 శాతం శ్లాబ్‌ను ప్రవేశపెట్టి దీనిలో లగ్జరీ వస్తువులు, సిన్ గూడ్స్ ప్రవేశపెట్టారు. అయితే 40 శాతం శ్లాబ్ అంటే ఏంటి? ఏ వస్తువులపై ఈ ప్రభావం పడనుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
సిన్ గూడ్స్ అంటే ఏంటి?
ఇవి ఆరోగ్యానికి లేదా సమాజానికి హాని కలిగించే వస్తువులు. ఉదాహరణకు తంబాకు, గుట్కా, పాన్ మసాలా, మద్యం, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ వంటివి. వీటిని తక్కువగా వాడమని ప్రభుత్వం ఈ రకమైన వస్తువులపై ఎక్కువ ట్యాక్స్ వేస్తుంది. ఈ ట్యాక్స్ డబ్బును ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు.
40 శాతంలో ఇంకా ఏ వస్తువులు ఉంటాయి
1200 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు
1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజిల్ కార్లు
350 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ ఉన్న బైక్స్
స్టేషన్ వ్యాగన్‌లు, రేసింగ్ కార్లు
ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్టులు, హెలికాప్టర్లు
యాట్స్, లగ్జరీ బోట్లు
ఆయుధాలు:
రివాల్వర్లు, పిస్టల్స్
తంబాకు ఉత్పత్తులు:
పాన్ మసాలా, గుట్కా, బీడీ, తంబాకు ఉత్పత్తులు
తంబాకు ఆకులు (ప్రాసెస్ చేయనివి)
సిగరెట్స్, స్మోకింగ్ ఉత్పత్తులు
పానీయాలు:
చక్కెర లేదా స్వీటెనర్లతో కూడిన గ్యాస్ డ్రింక్స్
కెఫీన్ ఉన్న డ్రింక్స్
ఫ్రూట్ బేస్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్
ఇతర నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, గేమింగ్
గతంలో ఈ వస్తువులపై 28 శాతం GSTతో పాటు అదనంగా కాంపెన్సేషన్ సెస్ వేసేవారు. ప్రస్తుతం దీనిని పూర్తిగా 40 శాతం పన్ను జాబితాలో చేర్చారు.
మంచి విషయం ఏంటంటే రోజువారీ వినియోగ వస్తువులపై ట్యాక్స్ తగ్గింది. టూత్‌పేస్ట్, సబ్బులు, షాంపూలు, చిన్న కార్లు, టీవీలు, ఏసీలు వంటివి 5 శాతం లేదా 18 శాతం శ్లాబ్ లోకి వచ్చాయి. అంటే ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి