Share News

Gold Mines Odisha: చైనా, పాకిస్తాన్ మాత్రమే కాదు..మన దగ్గర కూడా భారీగా గోల్డ్ నిల్వలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:23 PM

ఇండియా బంగారం దిగుమతులపై ఆధారపడే రోజులు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశాలో కొన్ని జిల్లాల్లో బంగారు నిధులు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారించారు.

Gold Mines Odisha: చైనా, పాకిస్తాన్ మాత్రమే కాదు..మన దగ్గర కూడా భారీగా గోల్డ్ నిల్వలు
Gold Mines Odisha

మన దేశంలో బంగారం అంటే జనాలకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పెళ్లిళ్లు, పండగలు, పూజలు సహా ఏ కార్యక్రమం అయినా కూడా బంగారం లేకుండా జరగదు. కానీ, మనం ఏటా 700-800 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గర సొంతంగా ఉత్పత్తి అయ్యేది కేవలం 1.6 టన్నులు మాత్రమే (2020 లెక్కల ప్రకారం). ఇప్పుడు ఒడిశా (Gold Mines Odisha) నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అక్కడ కొత్తగా బంగారు నిల్వలు కనుగొన్నారు. ఇది మన దేశ ఖనిజ సంపద, ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని చెప్పవచ్చు.


బంగారం ఎక్కడెక్కడ?

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఒడిశాలోని పలు జిల్లాల్లో బంగారు నిల్వలను గుర్తించింది. దేవగఢ్‌లోని అడసా-రాంపల్లి ప్రాంతంతో పాటు సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్ జిల్లాల్లో బంగారం ఉన్నట్టు నిర్ధారణ అయింది. అంతేకాదు, మయూర్‌ భంజ్, మల్కాన్‌గిరి, సంబల్‌పూర్, బౌద్ జిల్లాల్లో కూడా ప్రాథమిక అన్వేషణ జరుగుతోంది. ఖనిజ శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.

అధికారిక లెక్కలు ఇంకా బయటకు రాలేదు. కానీ జియోలాజికల్ అంచనా ప్రకారం ఒడిశాలో 10-20 మెట్రిక్ టన్నుల బంగారం (రూ. 20,363.39 కోట్ల విలువైన) ఉండొచ్చు. ఇది మన దిగుమతులతో పోలిస్తే తక్కువే అయినా, భారత్‌లో సొంత ఉత్పత్తి పెంచడానికి ఇది ఒక మంచి విషయం.


ఒడిశాకు ఎలాంటి లాభాలు?

ఒడిశా ఇప్పటికే క్రోమైట్, బాక్సైట్, ఇనుప ఖనిజాలకు ప్రసిద్ధి. ఇప్పుడు బంగారం కూడా వెలుగులోకి రావడంతో రాష్ట్ర ఖనిజ సంపద మరింత పెరుగుతుంది. ఈ కొత్త బంగారు నిల్వలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేయడమే కాకుండా, స్థానికంగా ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార అవకాశాలను కూడా పెంచుతుంది.

ఈ నేపథ్యంలో దేవగఢ్‌లో మొదటి బంగారు గని బ్లాక్‌ను వేలం వేయడానికి ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (OMC), GSI సిద్ధమవుతున్నాయి. ఈ గనుల వాణిజ్య సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అన్వేషణ స్థాయి నుంచి అధునాతన సాంపిలింగ్, డ్రిల్లింగ్ దశలకు చేరుకుంది.


నెక్ట్స్ ఏంటి?

ఈ బంగారు నిల్వలను సమర్థవంతంగా వినియోగించడానికి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందుగా, ల్యాబ్ విశ్లేషణ ద్వారా ఖనిజ గ్రేడ్, రికవరీ రేట్లను నిర్ధారిస్తారు. ఆ తర్వాత సాంకేతిక కమిటీలు ఈ ప్రాజెక్ట్‌ల సాధ్యాసాధ్యాలను సమీక్షిస్తాయి. మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ ప్రకారం పారదర్శక వేలం నిర్వహిస్తారు. అంతేకాదు, పర్యావరణ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేసి, గనుల చుట్టూ రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలను కల్పిస్తారు.


భారత్‌కు ఎందుకు ముఖ్యం?

మన దేశం బంగారం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. చైనా, పాకిస్తాన్ ‌లాంటి దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒడిశాలో బంగారు గనులు కనుగొనడం భారత్‎కు మంచి పరిణామం. ఈ గనులు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే, దిగుమతుల భారం తగ్గడమే కాక, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 07:29 PM