Share News

Land Encroachment : విశాఖ భూస్కామ్‌పై విచారణ ఏమైంది?

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:07 AM

విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు భోంచేశారు. రీసర్వే పేరిట భూముల రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు ఖాతాలో చూపించారు.

 Land Encroachment : విశాఖ భూస్కామ్‌పై విచారణ ఏమైంది?
Vizag Land Scam

  • అక్రమాలకు సమాధి కట్టేశారా!?

  • అసలు అక్రమాలే లేవంటూ తొలి నివేదిక

  • మళ్లీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

  • ఈసారి 64 ఎకరాలతో యంత్రాంగం మమ

  • వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీ

  • విశాఖ, చుట్టుపక్కల భూముల స్వాధీనం

  • నాడు చెలరేగిన ఉత్తరాంధ్ర పెద్దాయన

  • పనిలోపనిగా కొందరు అధికారుల దందా

  • వారిని కాపాడేందుకు నేడు కొందరి యత్నం

  • విచారణ కమిటీలో ‘సొంత మనుషులు’

  • అక్రమాలే లేవంటూ క్లీన్‌చిట్‌

  • అవి ఆషామాషీ కుంభకోణాలు కాదు!

ఒకటీ, రెండూ కాదు! బంగారంకంటే విలువైన భూములున్న విశాఖ నగరాన్ని, జిల్లాను ఐదేళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కారు పెద్దలు యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. వందల ఎకరాల భూములు వారి సొంతమయ్యాయి. విపక్షంలో ఉండగా... ‘ఘోరం... నేరం... దారుణం’ అని టీడీపీ నేతలు వాపోయారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది! మరి... విశాఖ భూముల స్కామ్‌లో ఏం తేల్చారు? ఇది... కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలూ అడుగుతున్న ప్రశ్న!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఉత్తరాంధ్ర వైసీపీ’ పెద్దాయన... ఆయనకు ‘జీ హుజూర్‌’ అన్నట్లుగా పని చేసిన కొందరు అధికారులు కలిసి విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు భోంచేశారు. రీసర్వే పేరిట భూముల రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు ఖాతాలో చూపించారు. ఈనాం భూముల రికార్డులను తారుమారు చేశారు. మరోవైపు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములకు 20 ఏళ్ల గడువు తీరిన తర్వాత శాశ్వత హక్కులు కల్పిస్తామని జగన్‌ సర్కారు 2023 ఆగస్టులో చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా జీవో 596 జారీ చేసింది. ఆ భూముల క్రయ, విక్రయాలకు అనుమతి ఇవ్వాలన్నది ప్రభుత్వం అసలు ఉద్దేశం. అసైన్డ్‌ చట్టసవరణ గురించి వైసీపీ నేతలకు ముందే తెలుసు. విలువైన అసైన్డ్‌, ఈనాం, ప్రభుత్వ భూములను చేజిక్కించుకునేందుకు కొందరు అస్మదీయ అధికారులను ఏరికోరి విశాఖలో నియమించారు.


ఉత్తరాంధ్ర వైసీపీలో పెద్దాయనగా చలామణి అయిన నేత, నాటి సీఎం జగన్‌కు దగ్గరి బంధువు, వైసీపీలో కీలక ప్రజాప్రతినిధి, ఆనాటి ప్రభుత్వంలో అత్యంత ప్రధాన అధికారి పోస్టును నిర్వహించిన సీనియర్‌ ఐఏఎస్‌, జగన్‌ వద్ద పని చేసిన మరో కీలక అధికారి కలిసి విశాఖ, భీమిలీ, వాటి పక్కనే ఉన్న భోగాపురంలో భారీగా అసైన్డ్‌, ఇనాం భూములు కొన్నారు. విశాఖ, భీమిలి, యండాడ, పరవాడ తదితర ప్రాంతాలను వైసీపీ పెద్దాయన చెరపట్టారు. కంటికి కనిపించిన భూములు చేజిక్కించుకున్నారు. నాటి ప్రభుత్వంలో ప్రధాన అధికారిగా పనిచేసిన ఓ సీనియర్‌ ఐఏఎస్‌, ఆయన వారసుడు ఈ భూపందేరం నిర్వహించారు. రాత్రిళ్లు అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయించడం, తెల్లారేసరికి ఆ భూములను చేజిక్కించుకోవడమే పనిగా ఆ అధికారి వారసుడు, మేనల్లుడు భూయజ్ఞం నిర్వహించారు. జగన్‌ దగ్గరి బంధువు, కీలక ప్రజాప్రతినిధి వారసుడు విశాఖలోని విలువైన ఇనాం, అసైన్డ్‌ భూములను చేజిక్కించుకున్నారు. బలవంతపు సెటిల్‌మెంట్లు కూడా చేశారు. వైసీపీ నేతల భూ దోపిడీపై నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పెద్ద పోరాటమే చేశాయి. విశాఖను కాపాడాలని ఉద్యమాలు చేశాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ‘సేవ్‌ విశాఖ’ నినాదం చేశారు. తాము అధికారంలోకి వస్తే భూములు కాపాడుతామని ప్రకటించారు. వైసీపీ అరాచకాలపై విసిగిపోయిన ప్రజలు కూటమికి పట్టం కట్టారు. అధికారంలోకి రాగానే మదనపల్లెలో జరిగిన ఫైళ్ల ‘దహనం’తో ఉలిక్కిపడిన సర్కారు అసైన్డ్‌, ఇనాం, షరతుగల పట్టా భూముల ఫ్రీహోల్డ్‌పై విచారణకు ఆదేశించింది. దీంతో... సహజంగానే విశాఖలో జగన్‌ జమానాలో జరిగిన భూముల అక్రమాలు బయటకొస్తాయని అంతా అనుకున్నారు.


సీన్‌ రివర్స్‌....

రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్‌, ఇనాం భూముల్లో అక్రమాలను గుర్తించేందుకు... డిప్యూటీ కలెక్టర్‌ ర్యాంకు అధికారులతో విచారణ కమిటీలు ఏర్పాటు చేయించి, అనుమానాలు ఉన్న ప్రతి మండలంలో భూమి రికార్డుల పునఃపరిశీలన చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల భూముల రికార్డులను పరిశీలించగా... అందులో 5.65 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేయడంలో అక్రమాలు జరిగాయని లెక్కతేలింది. చిత్రంగా... విశాఖలో మాత్రం ఎలాంటి అక్రమం జరగలేదని తేల్చారు. సెంటు భూమి కూడా పరాధీనం కాలేదని గత అక్టోబరులో అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై ‘విశాఖలో అక్రమాలే లేవట’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం మరోసారి పరిశీలనకు ఆదేశించింది. డిసెంబరులో అధికారులు రెండో దఫా విచారణ జరిపారు. మరీ ఏం జరగలేదంటే ఏమైనా అనుకుంటారని కాబోలు... ఓ 64 ఎకరాలను జీవో 596కి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్‌ చేశారని తేల్చారు. అయితే ఆ భూమి పదిలంగానే ఉందని, ఎలాంటి రిజిస్ట్రేషన్‌లు జరగలేదని నివేదించారు. రాష్ట్రంలో ఎక్కడా అనుమానాలు, ఆరోపణలు లేనిచోట పరిశీలన జరిపితేనే వేలాది ఎకరాలు చేతులు మారినట్లుగా తేలింది. అలాంటిది... విశాఖ జిల్లాలో ఏ అక్రమం లేదని తేల్చడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


విశాఖ భూ దందాలో ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దనేత, జగన్‌ దగ్గరి బంధువైన ప్రజాప్రతినిధి, ఆయన వారసుడితోపాటు... నాడు జగన్‌ ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేసిన సీనియర్‌ ఐఏఎస్‌, ఆయన వారసుడు, మేనల్లుడు, జగన్‌ వద్ద పనిచేసిన మరో కీలక అధికారి పాత్ర సుస్పష్టం. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందన్న నమ్మకంతో తాము పోగేసిన అక్రమ సంపాదనను భూములపై ఖర్చుపెట్టారు. కానీ... వారు అనుకున్నదొకటి, అయ్యిందొకటి! కూటమి ప్రభుత్వ విచారణలో ఈ విషయాలు బయటకు రావడం ఆ నేతలకు, అధికారులకు ఇష్టం లేదు. అప్పుడు వైసీపీ పెద్దాయనతో అంటకాగి... అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు కొందరు సీనియర్లు రంగంలోకి దిగారని... వారివల్లే భూస్కామ్‌పై విచారణ అటకెక్కిందనే ప్రచారం జరుగుతోంది. భూమి రికార్డుల పరిశీలన, విచారణ బృందాల్లో అంతా సొంత మనుషులే ఉండేలా జాగ్రత్త తీసుకుని అక్రమాలకు సమాధికట్టినట్లు తెలుస్తోంది. కూటమి సర్కారు సీరియ్‌సగా తీసుకుని... ఒకటికి రెండుసార్లు విచారణ జరిపించినా ఇదీ పరిస్థితి!


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 08:11 AM