YCP Corruption : ‘మండలి’ కళ్లకు గంతలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:46 AM
శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు అడిగిన ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇచ్చారు. జగన్ జమానాలో ప్రభుత్వ భూములే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ ...

టీడీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ‘రెవెన్యూ’ తప్పుడు సమాచారం
వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ఎన్నో ఆక్రమణలు
అయినా అక్రమాలు లేవని తహశీల్దార్ల నివేదిక
నాడు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణ
ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములనూ వదలని వైనం
ప్రజలు నివసిస్తున్న పల్లె వైసీపీ నేత పేరిట ఆన్‌లైన్
చెరువును ఆక్రమించి, కాలువలు పూడ్చి వెంచర్
వైసీపీ నాయకులకు సహకరించిన తహశీల్దార్లు
రెవెన్యూ సదస్సుల్లో వేలాది ఫిర్యాదులు
(రాయచోటి-ఆంధ్రజ్యోతి)
అన్నమయ్య జిల్లాలోని కొందరు తహశీల్దార్లు శాసనమండలి కళ్లకు గంతలు కడుతున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన భూ ఆక్రమణ దాష్టీకాలను సభ దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు అడిగిన ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇచ్చారు. జగన్ జమానాలో ప్రభుత్వ భూములే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన భూములను వైసీపీ నాయకులు దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నా.. తమ మండలాల్లో అసలు ఎలాంటి భూ అక్రమాలూ జరగలేదని ఆర్డీవోకు తహశీల్దార్లు నివేదికలు పంపించారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమించుకున్నా, సాక్షాత్తూ ప్రజలు నివసిస్తున్న పల్లెనే ఆన్‌లైన్ చేసినా రెవెన్యూ అఽధికారుల కళ్లకు కనిపించకపోవడం విడ్డూరం. వైసీపీ పాలనలో జరిగినన్ని భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినా రెవెన్యూ అధికారులు ఇలా తప్పుడు నివేదికలు ఎందుకు పంపించారో?
ఇదీ ప్రశ్న
గత ఏడాది నవంబరు 2వ తేదీన శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ భూ అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. 2019 నుంచి 2024 వరకు భూ ఆక్రమణ కేసులు, భూ సంబంధిత అక్రమ లావాదేవీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అసైన్డ్‌భూముల ఆక్రమణల వివరాలు కోరారు.
ఇదీ నివేదిక
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలో సమాచారం పంపారు. జిల్లాలోని 30 మండలాల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన తహశీల్దార్లు అందరూ తమ మండలాల్లో ఎటువంటి భూ ఆక్రమణలు జరగలేదని నివేదికలు పంపించారు. ఆక్రమణలు జరిగాయని పంపిన తహశీల్దారులు కూడా నామమాత్రంగా ఒకటో, రెండో సంఘటనలను నివేదికలో ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీపై సమాచారాన్ని సేకరించి బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీలు సమాచారాన్ని అడిగితే.. అధికారులు తప్పుడు నివేదిక ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
అన్నమయ్య జిల్లాలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాల్లో మచ్చుకు కొన్ని
ఇవిగో అక్రమాలు
రామాపురం మండలం బండపల్లె గ్రామం పొత్తుకూరుపల్లె సర్వే నంబరు 75/2లో 6.02 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబరు 129లో 15.75 ఎకరాలకు పైనే భూమి ఉంది. ఈ రెండు సర్వే నంబర్లలో కలిసి సుమారు నాలుగు ఎకరాలలో 75 ఇళ్లున్నాయి. ఈ సర్వే నంబర్లలో భూమిని వైసీపీ నేత సదిపిరాళ్ల రాంబాబురెడ్డి పేరు మీద 2022 జూన్ 28న అప్పటి తహశీల్దార్ ఖాజాబీ ఆన్‌లైన్ చేశారు. ఈ భూమి 1970 నుంచి తమ పెద్దల అనుభవంలో ఉంద ని, తమదే అనడానికి ఆధారాలు ఉన్నాయని స్థానికులు కొందరు వాపోయారు. తప్పుడు రికార్డులతో రాంబాబురెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలు, 1బీ అడంగల్ వంటి రికార్డులు పొందారని స్థానికులు ఆరోపించారు. వాస్తవానికి సర్వే నంబరు 75/2 విషయంలో ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. అయితే అప్పటి రామాపురం తహశీల్దార్ ఖాజాబీకు ఈ విషయం తెలిసినా, సరైన పత్రాలు లేకపోయినా రాంబాబురెడ్డి పేరు మీద మొత్తం 6.02 ఎకరాలను ఆన్‌లైన్ చేసేశారు. అక్కడ పల్లె ఉందన్న సంగతీ పట్టించుకోలేదు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న గ్రామస్థులు.. రాంబాబురెడ్డి పేరిట చేసిన భూమిని ఆన్‌లైన్ నుంచి తొలగించాలని తహశీల్దార్ ఖాజాబీని వేడుకున్నా పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి ఆమె బదిలీపై వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో సర్వే నంబరు 129లో ఉన్న 15.75 ఎకరాలకు పైగా భూమిలో సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 35కి పైగా ఇళ్లు ఉన్నాయి. అయినా 15 ఎకరాలను రాంబాబురెడ్డి పేరిట ఆన్‌లైన్ చేశారు. ఎన్నికల సమయంలో తహశీల్దార్ శ్రీనివాసులు ఈ పని చేశారు.
కుంట ఆక్రమణ
రామాపురం మండలంలోని బండపల్లె గ్రామం పొత్తుకూరుపల్లెలో ఉన్న యరాకుంటను కూడా వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. రాయచోటి మండలం దిగువఅబ్బవరం గ్రామం సర్వే నంబరు 503లో సుమారు 12 ఎకరాలు, పొత్తుకూరుపల్లెలో సర్వే నంబరు 166లో 6 ఎకరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో సుమారు 8ఎకరాలను సదిపిరాళ్ల రెడ్డెమ్మ పేరు మీద అప్పటి తహశీల్దార్ మాధవ క్రిష్ణారెడ్డి ఆన్‌లైన్ చేసేశారు. తర్వాత ఇక్కడికి తహశీల్దార్‌గా వచ్చిన మాధవ క్రిష్ణారెడ్డి భార్య అనురాధ గ్రామస్థుల వినతి మేరకు ఆన్‌లైన్ నుంచి తొలగించారు. అయినా ఇప్పటికీ ఆ భూమి ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది. బి.కొత్తకోట మునిసిపాలిటీలో ఉన్న కానగలకుంట చెరువును ఆక్రమించి అప్పట్లో వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు.
లేని సర్వే నంబర్‌లో ఆన్‌లైన్
వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం రెడ్డివారిపల్లెలో సర్వేనంబరు 446లో 44.80 ఎకరాల విస్తీర్ణంలో తిమ్మారెడ్డి కుంట ఉంది. తాటిగుంట్ల వీరకొండ్రెడ్డిగారి రెడ్డెయ్య పేరు మీద ఈ కుంటలో 2.91 ఎకరాలు అప్పటి తహశీల్దార్ మహేశ్వర్‌రెడ్డి ఆన్‌లైన్ చేశారు. సర్వే నంబరు 451/ఏ2గా నమోదు చేశారు. వాస్తవానికి ఇక్కడ ఈ సర్వే నంబరే లేదు. చాలా సంవత్సరాల కిందట 451/1 నంబరులో సుమారు ఒకటిన్నర ఎకరాను రైతులకు ప్రభుత్వం అసైన్‌మెంటు కింద ఇచ్చింది.
ఫిర్యాదుల వెల్లువ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో దౌర్జన్యానికి గురైన వేలాది మంది బాధితులు తమ గోడు వెళ్ల్లబోసుకుంటున్నారు. నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో 2022 నుంచి నేటి వరకు సుమారు 35వేల పైచిలుకు భూ సంబంధిత వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి రావడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News