Share News

Anakapalli : భర్త వేధింపులు తాళలేక కుమారుడు సహా హోంగార్డు ఆత్మహత్య

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:22 AM

అనకాపల్లి పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన హోంగార్డు దొండా రాంబాబు కుమార్తె ఝాన్సీకి...

Anakapalli : భర్త వేధింపులు తాళలేక కుమారుడు సహా హోంగార్డు ఆత్మహత్య

  • ఏలూరు కాలువలో మృతదేహాలు గుర్తింపు

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): భర్త వేధింపులు తాళలేక ఒక మహిళా హోంగార్డు తన ఐదేళ్ల కుమారుడితో కలిసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన హోంగార్డు దొండా రాంబాబు కుమార్తె ఝాన్సీకి, కశింకోటకు చెందిన అట్టా అచ్యుతరావుకు 2012లో వివాహం జరిగింది. అచ్యుతరావు అనుమానంతో ఝాన్సీని వేధిస్తుండేవాడు. దాంతో కొంతకాలానికే ఆమె అనకాపల్లి పట్టణంలోని గాంధీనగర్‌ అంజయ్య కాలనీలో ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. పెద్దలు రాజీ చేయడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లింది. హోంగార్డుగా పనిచేసే రాంబాబు ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో రెండేళ్ల క్రితం ఆ ఉద్యోగం ఝాన్సీకి వచ్చింది. ప్రస్తుతం ఆమె అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. అచ్యుతరావు బయ్యవరంలో ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వారికి కుమారుడు దినేష్‌ కార్తీక్‌(5) ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం భార్యతో అచ్యుతరావు గొడవపడ్డాడు. దీంతో ఆమె అంజయ్యకాలనీలో ఉంటున్న తల్లి సత్యవతి వద్దకు వచ్చేసింది. సాయంత్రం గాంధీనగరంలో దినేష్‌ కార్తీక్‌ చదువుతున్న స్కూల్‌కు వెళ్లి, కుమారుడిని తీసుకుని నేరుగా తుమ్మపాల సమీపంలో గల ఏలేరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజులుగా కుమార్తె, మనమడు కనిపించకపోవడంతో సత్యవతి, ఆమె బంధువులు వెతకడం ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఏలేరు కాలువలో మృతదేహం ఉన్నట్టు తుమ్మపాల గ్రామస్థుల నుంచి సమాచారం రావడంతో సీఐ మృతదేహాన్ని పరిశీలించి హోంగార్డు ఝాన్సీగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో కాలువలో దినేష్‌ కార్తీక్‌ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. అచ్యుతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 04:22 AM