Srinivas Verma: త్వరలో నరసాపురం - చెన్నై మధ్య వందే భారత్
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:10 PM
నరసాపురం - తిరువణ్ణామలై(అరుణాచలం) మధ్య ప్రత్యేక రైల్వే సర్వీసును కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సర్వీసు వల్ల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
భీమవరం, జులై 09: నరసాపురం - తిరువణ్ణామలై(అరుణాచలం) స్పెషల్ ట్రైన్ సర్వీసు ద్వారా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. బుధవారం నరసాపురం రైల్వే స్టేషన్‌లో నరసాపురం, తిరువణ్ణామలై స్పెషల్ ట్రైన్‌ను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ట్రైన్‌లో ఆయన భీమవరం వరకు ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అరుణాచలం వెళ్ళి ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలని యావత్ హిందూ భక్తుల కోరిక అని తెలిపారు. అలాగే ఈ ట్రైన్ ద్వారా తిరుపతి, అరుణాచలం వెళ్లి దేవుడిని దర్శనం చేసుకునే అవకాశం ప్రయాణికులకు కలుగుతుందన్నారు. మూడు నెలలు పాటు ఈ సర్వీసును స్పెషల్ ట్రైన్‌గా నడిపేందుకు అధికారులు ఒప్పుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో వారానికి మూడు రోజులు ఈ ట్రైన్ సర్వీసు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారాయన.
ఇక ఈ నరసాపురం - అరుణాచలం స్పెషల్ ట్రైన్ సర్వీసుకు బుకింగ్స్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే రిజర్వేషన్ క్లోజ్ అయిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వివరించారు. దీంతో ఈ ట్రైన్ సర్వీస్‌కు ఎంత ప్రాధాన్యత ఉన్నదో రైల్వే అధికారులకు అర్థమైందన్నారు. అలాగే నరసాపురం - చెన్నై మధ్య వందే భారత్ రైల్వే సర్వీసును త్వరలో ప్రారంభిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సంచలన వ్యాఖ్యలు
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్
For More Andhrapradesh News and Telugu News..