ఆయుర్వేదంలో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా భారతీయ వంటకాల్లో ఇంగువను విరివిగా ఉపయోగిస్తారు.
ఇది వంటకాలకు ప్రత్యేక రుచి, సువాసన ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ఇంగువ ప్రేరేపిస్తుంది. తద్వారా అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది నరాల ఉద్దీపన, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతారు.
దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి హానికరమైన బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆస్తమా, బ్రాంకైటిస్, నిమోనియా, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. కఫాన్ని బయటకు నెట్టడానికి దోహదపడుతుంది.
ఇంగువలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తం గడ్డకట్టకుండా నిరోధించ వచ్చనని చెబుతారు.
మహిళల్లో ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా తగ్గిస్తుందంటారు. స్త్రీలలో నెలసరి క్రమం తప్పకుండా చేసి.. నొప్పిని అదుపు చేస్తుందని చెబుతారు.
వీటిలో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులను నివారిస్తుందంటున్నారు.
ఇంగువ సాధారణంగా సురక్షితమైనదే. కానీ కొంత మందిలో కొన్ని దుష్ప్రభావాలు కనిపించ వచ్చనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక మోతాదులో తీసుకుంటే లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నష్టాలు ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు.
అధిక మోతాదులో ఇంగువ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి సమస్యలు తలెత్తవచ్చనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో తలనొప్పి లేదా మైకం వచ్చినట్టు అనిపించవచ్చు.
ఇంగువ రక్తపోటును తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. అయితే తక్కువ రక్తపోటు ఉన్నవారు లేదా రక్తపోటును నియంత్రించే మందులు వాడుతున్న వారు దీన్ని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. దీని వల్ల పెదవులు, ముఖం, నాలుక వాపు వంటి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంగువ రక్తం పలుచబడటానికి దోహదం చేస్తుంది కాబట్టి రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు దీనిని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
మూర్ఛ లేదా ఇతర కేంద్ర నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఇంగువను నివారించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
గర్భిణులు, పాలిచ్చే వారు ఇంగువను అధికంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శిశువులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వారు సూచిస్తున్నారు.