Madhavi Latha: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:26 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికపై బీజేపీ నేత మాధవి లత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంశంపై స్పందించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాలేజీల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జులై 09: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ వీడి ఎందుకు వెళ్లి పోయారో ఆయనకే తెలియదని బీజేపీ నేత మాధవి లత వ్యంగ్యంగా అన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే.. ఆ రోజు పార్టీలో మగాళ్లు లేరా అని రాజాసింగ్ ప్రశ్నించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. అయినా రాజాసింగ్ తన తమ్ముడేనని ఆమె స్పష్టం చేశారు.
బుధవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో బీజేపీ నేత మాధవి లత మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో తన తమ్ముడు రాజా సింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. గోషామహల్ కాదు ప్రస్తుతం అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో తాను పర్యటిస్తున్నానన్నారు. తనకు ఒక్క గోషామహల్ నియోజకవర్గమే కాదని.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తన పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇష్టమన్నారు. తనకు అవకాశం ఇస్తే బరిలో ఉంటానని మాధవి లత వెల్లడించారు.
పేద ప్రజల ఇళ్లు కూలుస్తున్న హైడ్రా.. ఫాతిమా కాలేజీ విషయంలో ఎందుకు భయ పడుతుందో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆమె డిమాండ్ చేశారు. తన పార్లమెంట్ పరిధిలోని వేలాది మంది ప్రజలు రోడ్డున పడే పరిస్థితి నెలకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ ఇచ్చే డబ్బుల మూటలతో ఈ ప్రభుత్వం నోరు కట్టేస్తుందని మండిపడ్డారు. దీనిపై త్వరలో తమ కార్యాచరణ ఉంటుందన్నారు.
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవి లత బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.
ఇక తెలంగాణలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఈ పదవికి గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేసేందుకు తన అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా.. మీకు, మీ పార్టీకో దండం అన్నారు.
అలాగే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకుండా.. సీనియర్లు అడ్డుకుంటున్నారంటూ రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు వేశారు. దీంతో రాజాసింగ్ వ్యవహారంపై పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తుంది.
మరోవైపు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తుంది. అలాంటి వేళ.. ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీకి చెందిన కళాశాల పట్ల హైడ్రా ఉదాసీనంగా వ్యవహరిస్తుందంటూ గత కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉదాసీన వైఖరి అవలంభించిందంటూ.. అందుకే హైడ్రా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఒక ప్రచారం సాగుతుంది.
ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ ఇటీవల అనార్యోగంతో మరణించారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీనిపై మరికొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికపై మాధవి లతపై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం జగన్‌కు ఇష్టం లేదు
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్
For More Telangana News and Telugu News..