R Srinivas Reddy: రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం జగన్‌కు ఇష్టం లేదు
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:43 PM
మామిడి రైతులను పరామర్శ పేరుతో బంగారుపాళ్యం వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఉనికి కోసం వైఎస్ జగన్ పాట్లు పడుతున్నారని విమర్శించారు.
కడప, జులై 09: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై ఆర్ శ్రీనివాసరెడ్డి బుధవారం కడపలో విలేకర్లతో మాట్లాడుతూ.. జగన్ దండుపాళ్యం లాగా బంగారుపాళ్యం వెళ్లారని అభివర్ణించారు. పార్టీ ఉనికి కోసం వైఎస్ జగన్ పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. గత వైసిపీ ప్రభుత్వంలో మామిడి రైతులు నష్టపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ పట్టించుకో లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం పరామర్శల పేరుతో ఆయన విధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళామన్నారు. కూటమి పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. కడప వైసిపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రఫ్ఫా రఫ్ఫా అని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి.. 11 సీట్లకు పరిమితం చేశారని వివరించారు.
నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నీచ సంస్కృతికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ విఫల యత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం జగన్‌కు ఇష్టం లేదన్నారు. వైసీపీని తిరస్కరించాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి పిలుపు నిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్
For More Andhra Pradesh News and Telugu News..