Brahma Kamalam: కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:33 AM
అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా బ్రహ్మకమలం ఒకటి పూస్తేనే జనం అద్భుతంగా చూస్తుంటారు.
ఏలూరు జిల్లా, డిసెంబర్ 8: బ్రహ్మ కమలం పుష్పాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ పుష్పాలు పూస్తుంటాయి. బ్రహ్మ కమలం పుష్పానికి హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. హిమాలయాల్లో దొరికే ఈ అరుదైన మొక్కను చాలా తక్కువ మంది మాత్రమే పెంచుతుంటారు. అలాగే ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మంచిదని అందరూ భావిస్తుంటారు. అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా బ్రహ్మకమలం ఒకటి పూస్తేనే జనం అద్భుతంగా చూస్తుంటారు. కానీ ఏలూరు జిల్లాలో మాత్రం పదుల సంఖ్యలో విరబూసిన పుష్పాలు కనువిందు చేస్తున్నాయి.
జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో సుబ్బారావు అనే వ్యక్తి ఇంట్లో పూసిన బ్రహ్మ కమలం పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఒక మొక్క నుంచి పదుల సంఖ్యలో పుష్పాలు విరబూశాయి. సుబ్బారావు సంవత్సరం క్రితం ఇతర ప్రాంతం నుంచి ఈ మొక్కను తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ మొక్క నుండి సుమారు 100పైగా బ్రహ్మ కమలం పుష్పాలు విరబూశాయి. చెట్టు నిండా పూసిన పూలు ఆకాశంలో నక్షత్రాలను తలపిస్తున్నాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల జనం తరలివస్తున్నారు. వందకుపైగా పూసిన బ్రహ్మ కమలం పుష్పాలను ఇంటి యజమాని వేంకటేశ్వర స్వామి పూజకు ఉపయోగించారు.
ఇవి కూడా చదవండి..
సాగునీటి పంపిణీ అస్తవ్యస్తం.. రైతుల గగ్గోలు
పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ.. జరిగింది ఇదే
Read Latest AP News And Telugu News