Grandhi On Pawan: పవన్‌ను.. కలవాలనుంది, అపాయింట్మెంట్ ఇస్తారా: గ్రంధి శ్రీనివాస్
ABN , Publish Date - Oct 26 , 2025 | 02:00 PM
'పవన్ కళ్యాణ్.. మిమ్మల్ని కలిసి అన్నీ చెప్పాలని ఉంది. నాకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు' అని భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు. చంద్రబాబు, పవన్‌లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాని చెప్పారు.
పశ్చిమగోదావరి: భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. భీమవరం నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా పేకాటలో చర్చనీయాంశం అయ్యిందన్న గ్రంధి.. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షనీయమన్నారు. 'పవన్ కళ్యాణ్.. మిమ్మల్ని కలిసి అన్నీ చెప్పాలని ఉంది. నాకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు' అని గ్రంధి శ్రీనివాస్ ఇవాళ(ఆదివారం) భీమవరంలో మీడియా ముఖంగా కోరారు. 2019 ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇక, భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపైనా గ్రంధి స్పందించారు. 14 నెలలుగా క్లబ్ నుంచి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు.. రెండు నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు. సదరు పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని గ్రంధి వ్యాఖానించారు. పోలీసు అధికారి పేకాట ఎప్పుడు ఆపాడో.. అప్పుడు వాళ్లకు వ్యతిరేకం అయ్యాడని గ్రంధి చెప్పుకొచ్చారు.
'కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయ్యింది. పోలీసులు రెండు నెలలుగా పేకాట క్లబ్ లు ఆపేశారు. 14 నెలలుగా భీమవరం క్లబ్ లలో పేకాట జరిగింది. ప్రజాప్రతినిధి, అధికార కూటమికి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి రూ.10 లక్షలు తీసుకుంటున్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్కో బ్రాందీ షాపు నుంచి నెలకు రూ.4.5 లక్షలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు' అని గ్రంధి వెల్లడించారు.
డీఎస్పీ జయసూర్య విషయంలో రఘరామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్ అని గ్రంధి అన్నారు. అసలు దొంగ ఎవరనేది తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ కు ఒక్క నిముషం కూడా పట్టదన్న గ్రంధి.. పేకాట విషయంలో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి