CM Chandrababu Naidu: ఏలూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 01 , 2025 | 08:31 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు ఆయన హెలికాప్టర్‌లో చేరుకుంటారు.
ఏలూరు, డిసెంబర్ 1: ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన హెలికాఫ్టర్‌లో ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపినాథపట్నం వెళ్తారు. స్థానికంగా నివసిస్తున్న నాగలక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించనున్నారు. గత కొంత కాలంగా నాగలక్ష్మీ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంది.
అనంతరం సీఎం చంద్రబాబు నల్లమాడకు చేరుకుంటారు. స్థానిక ప్రజావేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెల మొదటి రోజు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని కుటుంబాలకు సీఎం చంద్రబాబు స్వయంగా పరామర్శించి.. ఆ కుటుంబానికి పింఛన్‌ను అందజేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డిసెంబర్‌లో కొత్తగా 8,190 పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ పింఛన్ల కోసం ప్రభుత్వం రూ. 2738. 71 కోట్లను విడుదల చేసింది.
ఇంకోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా శిబిరాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 144 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవ్‌జీని కోర్టులో హాజరు పరచాలి
For More AP News And Telugu News