CM Chandrababu Speech: పని చేయకపోతే ప్రజల ముందే నిలబెడతా.. సీఎం వార్నింగ్
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:12 PM
పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని... చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు కష్టాలు లేని ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
విజయనగరం, అక్టోబర్ 1: జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొని ప్రసంగించారు. ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం చేపట్టామని తెలిపారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా గత పాలకులు ఆలస్యం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తూనే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. 2026 ఆగస్టుకు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయని... ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. సంక్షేమం ఇవ్వడమే కాదు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని... చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు కష్టాలు లేని, ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. లంచాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యత తీసుకున్నామన్నారు. వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందిస్తున్నామని... రహదారులను కూడా బాగు చేస్తున్నామని చెప్పారు. ఇచ్చే సంక్షేమం, చేసే అభివృద్ధి వల్ల ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చిన వారు సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పీ4 ద్వారా లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదల్ని వృద్ధిలోకి తెస్తారన్నారు.
ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికే పీ4 కార్యక్రమమని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఆడబిడ్డలకు స్వేచ్ఛ, రక్షణ కల్పించటంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు సీఎం. ప్రజలు ఆశీర్వదిస్తేనే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదని తెలిపారు. బాగా పనిచేయకపోతే గతంలో తిట్టేవాడినని ఇప్పుడు ప్రజల ముందు నిలబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల బాగోగుల కోసం నిర్దిష్టమైన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పెడసనగల్లు-అయ్యాంకి రహదారి పనులు షురూ.. దాతకు ఎమ్మెల్యే అభినందనలు
Read Latest AP News And Telugu News