Weather Updates: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ వర్ష సూచన..
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:05 PM
వాతావరణ పరిస్థితిపై వైజాగ్ తుపాను హెచ్చరిక కేంద్రం జగన్నాథ్ కుమార్ కీలక సమాచారం ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని చెప్పారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన..
విశాఖపట్నం, ఆగస్టు 19: వాతావరణ పరిస్థితిపై వైజాగ్ తుపాను హెచ్చరిక కేంద్రం జగన్నాథ్ కుమార్ కీలక సమాచారం ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని చెప్పారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒరిస్సాలోని భవానీ పట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ వాయుగుండం దక్షిణ ఒరిస్సా, దక్షిణం చత్తీస్‌ఘడ్ మీదుగా ప్రయాణించి అల్ప పీడనముగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జగన్నాథ్ తెలిపారు.
వాయుగుండం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన..
వాయుగుండం ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ తెలిపారు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అన్ని పోర్టులలోనూ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందన్నారాయన. కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారు చెట్ల కింద తలదాచుకోవద్దని సూచించారు. సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలన్నారు. అలాగే మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని హితవు చెప్పారు.
Also Read:
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
ఈ మోసాలతో జాగ్రత్త..EPFO అలర్ట్..
For More Andhra Pradesh News and Telugu News..