Visakhapatnam: వీఎంఆర్డీఏలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు.. టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:32 AM
వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే తమ తప్పు తెలుసుకున్న వీఎంఆర్డీఏ అధికారులు వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు చేశారు.
విశాఖపట్నం, డిసెంబర్ 22: వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈరోజు (సోమవారం) చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీలో జాయినింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఇందు కోసం వీఎంఆర్డీఏ అధికారులు కళ్లు మూసుకుని మరీ వైసీపీకి అనుమతి ఇచ్చారు. ఎరీనాలో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు వారి నుంచి వీఎంఆర్డీఏ రూ.71,300 ఫీజు కూడా కట్టించుకుంది. అయితే చిల్డ్రన్స్ ఎరినాలో పార్టీ కార్యక్రమం నిర్వహించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వీఎంఆర్డీ అధికారులు నాలుక కరుచుకున్న పరిస్థితి.
వెంటనే తమ తప్పును తెలుసుకున్న అధికారులు.. చివరి నిమిషంలో అనుమతి లేదని వైసీపీకి తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఎవరినీ లోపలికి రానివ్వకుండా వీఎంఆర్డీఏ సిబ్బంది అడ్డుకుంది. అయితే అప్పటికే వైసీపీ పార్టీ నేతలు, శ్రేణులు వీఎంఆర్డీఏ వద్దకు చేరుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో గేటు ముందే ఉండిపోయారు. నిన్నటి నుంచి చిల్డ్రన్స్ థియేటర్లో, బయట వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నప్పుడు అధికారులు కళ్లు మూసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే తమ దగ్గర రూ.71,300 ఫీజులు తీసుకొని.. ఇప్పుడు అనుమతి లేదనడం ఎంత వరకు న్యాయం అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఎంఆర్డీఏ గేటు వద్ద భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..
వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News