Vizag Traffic Diversions due to ODI: నేడు విశాఖలో వన్డే క్రికెట్ మ్యాచ్.. పోలీసుల ఆంక్షలివే..
ABN , Publish Date - Dec 06 , 2025 | 08:29 AM
విశాఖపట్నంలో శనివారం భారత్-దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ జరగనున్న సందర్భంగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడిక్కడే పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. స్టేడియంలోకి వెళ్లే ప్రేక్షకులను తనిఖీ చేశాకే అనుమతించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై స్టేడియంలోకి నిషేధం విధిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
మధురవాడ, డిసెంబరు 06: భారత్- దక్షిణాఫ్రికా(IND Vs SA) జట్ల మధ్య పీఎం పాలెం ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం(ACA VDCA Cricket Stadium)లో శనివారం జరగనున్న డే అండ్ నైట్ వన్డే మ్యాచ్(Oneday Match) సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల వాహనాల పార్కింగ్‌కు 11 చోట్ల స్థలాలు ఏర్పాటుచేశామన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం నుంచి నగరానికి వచ్చే వాహనాలు.. పెందుర్తి, ఎన్ఏడీ, టీసీ పాలెం మీదుగా వెళ్లాలి. నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపునకు వెళ్లే బస్సులు టీసీ పాలెం, ఎన్ఏడీ, పెందుర్తి, శొంఠ్యాం మీదుగా ప్రయాణించాలి. విజయనగరం, శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చే చిన్న వాహనాలు మారికివలస వద్ద ఎడమవైపు తిరిగి జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం వద్ద కుడివైపు తిరిగి బీచోడ్డుపై రుషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు కారు షెడ్ వద్ద మలుపు తిరిగి మిథిలాపురి ఉడా కాలనీ, ఎంవీవీ సిటీ, లాకాలేజీ మీదుగా పనోరమ హిల్స్ చేరుకుని.. రుషికొండ మీదుగా నగరంలోకి వెళ్లాలి. నగరం నుంచి వచ్చే బస్సులు, కమర్షియల్ వాహనాలు హనుమంతవాక వద్ద బీఆర్ ఎస్ రోడ్డులో అడవివరం, నీలకుండీలు జంక్షన్ మీదుగా ఆనందపురం చేరుకోవాలి.
వీవీఐపీ పాసులున్న వాహనాలు గ్రౌండ్ పి-1, వీఐపీ వాహనాలు.. బి గ్రౌండ్లో పి-2 వద్ద నిలిపివేయాలి. వి కన్వెన్షన్ పీ-సీ వద్ద వాహనాలు నిలుపుకోవచ్చు. నగరం నుంచి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే వాహనాదారులు హోల్డేజ్ హోమ్ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ పి-4లో పార్కింగ్ చేయాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన వాహనాలు.. షెడ్ జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల పి-4 లో పార్క్ చేయాలి. మీడియా వాహనాలను గేట్ నంబరు 10, 11 సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుడి వద్ద పి-5లో పార్కింగ్ చేయాలి.
శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే ఇతర వాహనాలు పెప్పీ వద్ద తిరిగి పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్ పి-6, ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డు పి-7, ద్విచక్రవాహనాలు జీవీఎంసీ పార్క్ పి-8, కళ్యాణ్‌కుమార్ సైట్ పి-9 వద్ద నిలిపివేయాలి. పోలీస్, రెవెన్యూ, ఇతర అధికారుల వాహనాలు ఎంవీవీ బిల్డర్స్ అపార్ట్మెంట్ ముందున్న పి-10లో పార్క్ చేయాలి. ఆర్టీసీ స్పెషల్ బస్సులు మారికివలస వద్ద ఎడమవైపు తిరిగి తిమ్మాపురం రోడ్డు మీదుగా లా కాలేజి చేరుకుని పి-11లో నిలపాలి. మ్యాచ్ అనంతరం సాంకేతిక కళాశాలలో పార్క్ చేసిన వాహనాలు విజేత సూపర్ మార్కెట్ మీదుగా కారు షెడ్ నుంచి ఎన్‌హెచ్-16 చేరుకోవాలి. నగరంలోకి వెళ్లేవారు హోల్టేజ్ హోమ్ జంక్షన్ నుంచి కుడివైపు తిరిగి ఎండాడ మీదుగా వెళ్లాలి.
స్టేడియంలోకి ఇవి నిషేధం..
ప్రేక్షకులు.. కెమెరాలు, మ్యాచ్ బాక్సులు, లైటర్లు, సిగరెట్లు, వాటర్ బాటిళ్లు, మండే స్వభావం గల వస్తువులు, కుర్చీలు, స్టూలు, పొగాకు ఉత్పత్తులు, టిఫిన్లు, పదును వస్తువులు, తినుబండారాలు, గౌడుగులు, క్రేకర్స్, బ్యాక్ ప్యాక్స్, జంతువులు, రేడియో, ఆల్కహాల్, కర్రలు, మ్యూజికల్స్, లేజర్ లైట్లు, బెలూన్లు, గ్లాస్ బాటిళ్లు, పెర్ఫ్యూమ్స్, స్ప్రే బాటిళ్లు, సిరంజిలు, విజిల్స్, హారన్స్, స్పోర్టింగ్ బాల్స్, రోలర్ స్కేటర్లు, ప్రమోషనల్ ప్రొడక్ట్స్ ల్యాప్టాప్లు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకెళ్లకూడదు(Banned things in Stadium).
భారీ భద్రత..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌కు సుమారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు(Police Security). స్టేడియం చుట్టూ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లు(Metal Detector) ఏర్పాటుచేశారు. డాగ్ స్క్వాడ్‌తో(Dog Squad) పిచ్ ఔట్‌ఫీల్డుతో పాటు గ్యాలరీలు, పరిసరాలను శుక్రవారం తనిఖీ చేశారు. అన్ని గేట్ల వద్ద క్యూలో ప్రేక్షకులను లోపలికి పంపించేలా బారికేడ్లు సిద్ధం చేశారు. మ్యాచ్ సుమారు రాత్రి 11 గంటల సమయంలో ముగుస్తుందని, వేల సంఖ్యలో వాహనాలు జాతీయ రహదారిపైకి రాకుండా చోదకులు సంయమనం పాటించి కొద్ది నిమిషాల వ్యవధిలో వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తవన్నారు.
ఇవీ చదవండి: