Share News

రూ. కోట్లు మట్టిపాలు...!

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:49 PM

రాయలసీమ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి కేంద్రం రూసా కింద రూ. పది కోట్లు ఇచ్చింది. జగనాథగట్టుపై ఐదు ఎకరాల్లో పనులు మొదలు పెట్టారు.

రూ. కోట్లు మట్టిపాలు...!
జగన్నాథగట్టుపై పిల్లర్ల దశలోనే ఆగిపోయిన రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ

ఆగిపోయిన రాయలసీమ ఇంజనీరింగ్‌ కాలేజీ పనులు

జగన్నాథగట్టుపై రూ.10 కోట్ల రూసా నిధులతో నిర్మాణాలు

వైసీపీ హయాంలో అందని బిల్లులు.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

తుప్పు పట్టిన పిల్లర్ల ఇనుప కడ్డీలు

ఇంజనీరింగ్‌ క్యాంపస్‌ నిర్మాణానికి రూ.75 కోట్లు అవసరం

రాయలసీమ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి కేంద్రం రూసా కింద రూ. పది కోట్లు ఇచ్చింది. జగనాథగట్టుపై ఐదు ఎకరాల్లో పనులు మొదలు పెట్టారు. గత వైసీపీ హయాంలో కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వలేదు. పనులు చేయలేనంటూ కాంట్రాక్టరు చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అసంపూర్తి పనులపై దృష్టి సారించలేదు. నాలుగేళ్లుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. పిల్లర్ల నిర్మాణం కోసం అమర్చిన ఇనుప కడ్డీలు తుప్పు పట్టాయి. కూటమి ప్రభుత్వం కూడా ఆదే మార్గంలో వెళ్తుండడం చూసి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి క్యాంపస్‌ నిర్మాణానికి రూ.75 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపై ఐదు ఎకరాల్లో రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. ప్రస్తుతం వర్సిటీ క్యాంపస్‌లో కొనసాగుతున్న ఈ కళాశాలలో సీఈసీ, ఈసీఈ, మెకానికల్‌, సివిల్‌, ఆర్టిఫీషియల్‌ ఇంజనీరింగ్‌ (ఏఐ) గ్రూపుల్లో దాదాపుగా 800 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. జగన్నాథగట్టుపై ఒక్కో బ్లాక్‌ 2,800 చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున 5,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బ్లాకుల నిర్మాణాలకు రూసా నిధులు రూ.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం. ఈ పనులు 18 నెలల్లో పనులు పూర్తి చేసేలా సాయి పవర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. పునాదులు తీసి పిల్లర్ల పనులు మొదలు పెట్టారు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా గ్రాంట్‌ విడుదల చేయడంలో అంతులేని నిర్లక్ష్యం వల్ల బిల్లులు అందక ఈ పనులు చేయలేనని 2021 డిసెంబరులో కాంట్రాక్టరు చేతులెత్తేశారు.

అభ్యంతరం రావడంతో..

రూపాల సంగమేశ్వరుడు ఆలయం పక్కనే ఐదెకరాలు కేటాయించారు. అభ్యంతరం రావడంతో ఆలయానికి దిగువన మరో భూమి కేటాయించారు. కొండను రాక్‌ కటింగ్‌ చేసి ఎగుడు దిగుడు లేకుండా చదును చేసి పునాదులు తీసి పిల్లర్లు (కాలమ్స్‌) వేశారు. అప్పటి వరకు దాదాపుగా రూ.2.50 కోట్లు ఖర్చు చేసినట్లు కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పార్ట్‌ బిల్లు పేమెంట్‌ కోసం 2021 అక్టోబరులో రూసా కార్యాలయానికి పంపారు. కాంట్రాక్టర్‌ సంస్థకు పార్ట్‌ బిల్లు సుమారు రూ.80 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. పనులు చేపడితే బిల్లులు చెల్లింపుకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు గ్యారెంటీ ఇవ్వాలని కాంట్రాక్టరు షరతు పెట్టడం, వర్సిటీ అధికారులు తమ చేతుల్లో లేదని తేల్చిచెప్పారు. దీంతో పనులు చేయలేనంటూ కాంట్రాక్ట్‌ సంస్థ రాతపూర్వకంగా తెలిపినట్లు అధికారులు అంటున్నారు. అంతేకాదు.. సకాలంలో ఇచ్చిన నిధులు వినియోగించుకోకపోవడం వల్ల రూసా నిధులు వెనక్కివెళ్లాయి. ఆ తరువాత యూనివర్సిటీ అధికారులు కేంద్రానికి లేఖ రాసి నిధులు తెప్పించినా పనులు మాత్రం మొదలు కాలేదు.

క్యాంపస్‌ నిర్మాణానికి రూ.75 కోట్లు అవసరం

ఆర్‌యూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఐదు విభాగాల్లో 1,600 సీట్లు ప్రభుత్వం కేటాయించింది. కళాశాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలంటే 25-30 తరగతి గదులు (క్లాస్‌ రూంలు), ఎనిమిది ల్యాబ్‌లు, బాలరు, బాలికలకు ప్రత్యేకంగా 1,600 మంది విద్యార్థులకు సరిపడ హాస్టళ్లు, పరిపాలన భవనాలు, లైబ్రరీ, కాన్ఫరెన్స్‌ హాల్స్‌.. ఇలా పూర్తిస్థాయిలో కళాశాల నిర్మించాలంటే పెరిగిన వ్యయం ప్రకారం దాదాపుగా రూ.75 కోట్లు అవసరం ఉందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ రెండు బ్లాక్‌లు మాత్రమే నిర్మాణాలు చేపట్టినా అవి కూడా పునాదుల్లోనే ఆగిపోయాయి. కాంట్రాక్ట్‌ సంస్థ పనులు చేయలేనంటూ రాతపూర్వకంగా ఇచ్చింది. దీంతో మళ్లీ టెండర్లు వేసి పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అది సాకారం కావాలంటే ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు మళ్లీ ప్రతిపాదనలు (రీ-ఎస్టిమెంట్స్‌) తయారు చేసి రూసా ఎస్‌పీడీకి పంపించి ఉన్నత విద్యా శాఖ అమోదం తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ఇప్పటికే ఖర్చు చేసిన రూ.కోట్లు ప్రజాధనం రూ.కోట్లు మట్టిపాలే అని పలువురు పేర్కొంటున్నారు.

ప్రభుత్వానికి నివేదిక పంపుతాం

జగన్నాథగట్టుపై ఆర్‌యూ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోయిన మాట నిజమే. గతంలో రూసా నిధులు వెళ్లాయి. ఈ తరువాత కేంద్రానికి లేఖలు రాసి నిధులు మంజూరు చేయించుకున్నాం. రూసా ఎస్‌పీడీ ఖాతాలో నిధులు ఉన్నాయి. పనులు చేయలేనని కాంట్రాక్టరు సంస్థ రాతపూర్వకంగా లేఖ రాసింది. పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. ఐదు ఇంజనీరింగ్‌ గ్రూపుల్లో 1,600 సీట్లు మంజూరు చేశారు. 24 క్లాస్‌ రూంలు, ఎనిమిది ల్యాబ్‌లు, బాలురు, బాలికలకు ప్రత్యేకంగా హాస్టళ్లు, పరిపాలన భవనం, లైబ్రరీ, కాన్ఫరెన్స్‌ హాల్స్‌.. నిర్మించాలి.

- విజయకుమార్‌ నాయుడు, రిజిస్ట్రార్‌, రాయలసీమ వర్సిటీ, కర్నూలు

Updated Date - Dec 05 , 2025 | 11:49 PM