Global Capability Summit 2025: విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:28 PM
విశాఖపట్నంలోని రుషికొండ రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విశాఖపట్నం: రుషికొండ రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ వండర్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అన్నారు. అరకు కాఫీ అనగానే గుర్తొచ్చేది విశాఖేనన్నారు. విశాఖ ఆతిథ్యం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. మహిళల భద్రత విషయంలో విశాఖ దేశంలో తొలి స్థానంలో ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య రాష్ట్రంలో విశాఖలోనే ఎక్కువగా ఉందని తెలిపారు.
భారతదేశం ఐటీ రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, ప్రతి నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతీయుడేనని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ త్వరలో విశాఖలో ప్రారంభం కానుందని వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చివరి దశలో ఉందని చెప్పారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనే లక్ష్యంతో లాజిస్టిక్స్‌పై దృష్టిపెట్టామని సీఎం పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్, గ్రీన్ హైడ్రోజన్, తదితర ఆధునిక ప్రాజెక్టులపైనా ఏపీ దృష్టి సారించిందని వివరించారు.
సామాజిక అభివృద్ధిపై దృష్టి
గతంలో ఇచ్చిన 'వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్' నినాదాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రజలకు సులభంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు వాట్సాప్ ద్వారా 170 ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ఆర్థిక మంత్రిపై ప్రశంసలు
ఈ సందర్భంగా జీఎస్టీ రంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకువచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమైనవిగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. జీఎస్టీలో తీసుకువచ్చిన మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థకు గేమ్‌చేంజర్‌గా నిలుస్తాయని.. నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు కావడం మనకు గర్వకారణమని సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
విదేశాల ప్రతినిధులతో భేటీ..
సదస్సు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పలు దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తొలుత సరయు హాలులో ఫ్రెంచ్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత శారదా హాలులో నెదర్లాండ్స్ బృందంతో ప్రత్యేక భేటీ నిర్వహించి ఏపీ అభివృద్ధికి సంబంధించి పలు కీలక చర్చలు నిర్వహించారు.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌కు ఆప్ నేత సవాల్..
For More Latest News