Cognizant In Visakhapatnam: విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:50 PM
విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఈవో రవి కుమార్ వెల్లడించారు. ముందుగా 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖపట్నం రావడం తన సొంతింటికి వచ్చినట్లుగా ఉందని కాగ్నిజెంట్ సంస్థ సీఈవో రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నం నగరం భవిష్యత్తులో ఎ.ఐ హబ్‌గా మారుతుందన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ సీఈవో రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ రవి కుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. ముందుగా 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తాము జీసీసీ సెంటర్ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్, సత్వా సంస్థతోపాటు మరో ఏడు ఐటీ సంస్థలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తోపాటు కాగ్నిజెంట్ సంస్థ ప్రతినిధులు కలిసి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతోందన్నారు. ఎకనమిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కాగ్నిజెంట్ సంస్థకు భారత్‌లో ఐదు సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పుణె, బెంగళూరు, కోల్‌కతా ఉన్నాయని గుర్తు చేశారు.
అంతేకాదు.. హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్ అండ్ రిసోర్సెస్ రంగాల్లో ఈ సంస్థ ఉందని వివరించారు. భారత్ నుంచే దాదాపు రెండున్నర లక్షల మంది ఈ సంస్థలో పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో 80 శాతం మంది భారతీయులేనని పేర్కొన్నారు. సంస్థ చీఫ్ సైతం మన దేశానికి చెందిన వ్యక్తి కావడం.. అది మన భారతీయుల శక్తి అని అభివర్ణించారు.
ఇక మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. కాగ్నిజెంట్ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఐటీ సంస్థల పెట్టుబడులతో విశాఖకు మరింత వెలుగు వచ్చిందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారామన్నారు. రాయితీ ప్యాకేజీపై గురువారం జరిగిన కేబినెట్ భేటీలో సైతం చర్చించామని గుర్తు చేశారు. విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం అదృష్టమన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
For More TG News And Telugu News